న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ అంతర్జాతీయ టోర్నీలో సత్తా చాటింది. చెక్ రిపబ్లిక్ వేదికగా జరిగిన గ్రాండ్‌ప్రిక్స్ టోర్నీలో లవ్లీనా రజత పతకంతో మెరిసింది. శనివారం అర్థరాత్రి మహిళల 75 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్లో లవ్లీనా 2 లి క్యుయాన్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో లవ్లీనా పోరాడినప్పటికీ చివరకు ప్రత్యర్థికి తలవంచింది.
గతేడాది ఆసియా గేమ్స్‌లోనూ ఇదే క్యుయాన్ చేతిలో లవ్లీనా బొర్గొహైన్ ఓటమి పాలైంది. ‘ఒలింపిక్స్‌కు ముందు రజతంతో మెరవడం సంతోషాన్ని ఇచ్చింది. గ్రాండ్‌ప్రిక్స్ టోర్నీ నా ప్రాక్టీస్‌కు బాగా ఉపయోగపడింది. ఒలింపిక్స్‌కు ముందు ఈ పతకం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’ అని మ్యాచ్ అనంతరం లవ్లీనా తెలిపింది. కాగా లవ్లీనాతో పాటు తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, ప్రీతి పవార్, నిషాంత్ దేవ్, అమిత్ పంగల్, జాస్మిన్ లంబోరియాలు పారిస్ టికెట్ అందుకున్నారు.