భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్నంలో ఓ ప్రేమ జంట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జంగారెడ్డి గూడెం మండల పరిధిలోని అక్కంపేట గ్రామానికి చెందిన ఆళ్ల గణేష్ పారేపల్లి జహ్నవి గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జహ్నవి కుటుంబ సభ్యులు వీరిద్దరిని పలుమార్లు హెచ్చరించారు.
ఇటీవల ఆ బెదిరింపులు మరింతగా పెరగడంతో ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయి ఈనెల 19 వ తేదీన భద్రాచలం వచ్చి స్థానికంగా ఉన్న ఓ అమ్మవారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తిరిగి ఈనెల 21 బుధవారం ఏలూరు జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకుమార్ ని కలిసి విషయం వివరించారు. స్పందించిన ఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు స్థానికంగా ఉన్న డిఎస్పీకి తెలియజేసి వీరిద్దరికీ రక్షణ కల్పించాలని ఆదేశించారు.
అయినప్పటికీ పోలీసుల నుండి ఎలాంటి సహకారం అందకపోవడంతో గణేష్ జాహ్నవి తిరిగి ఈనెల 22న మళ్లీ భద్రాచలం వచ్చారు. ఈ క్రమంలో శనివారం జాహ్నవి కుటుంబ సభ్యులు, బంధువులు గణేష్ బావ వరుసైన మందపాటి రాజు మధ్యవర్తిగా వ్యవహరించి వారి వివాహం చేశాడని అనుమానంతో, జంగారెడ్డిగూడెంలోని మైసన్న గూడెం గ్రామంలో ఉన్న రాజు పై దాడికి పాల్పడ్డారు. రాజు జంగారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గణేష్, జాహ్నవి ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుమందు తాగారు. తమను అశ్వరావుపేటలో దించాలని ఓ ప్రైవేటు టాక్సీని మాట్లాడుకొని వెళ్తున్న క్రమంలో బూర్గాపాడు మండలం సారపాక వద్దకు చేరుకునేసరికి వారిద్దరూ కారులోనే వాంతులు చేసుకున్నారు. దీంతో భయాందోళన గురైన కారు డ్రైవర్ వీరిద్దరిని సారపాకలో దింపాడు.