calender_icon.png 3 April, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

02-04-2025 11:56:04 PM

తల్లి కూతుళ్లపై కత్తితో దాడి

ప్రేమను నిరాకరించిందన్న కోపంతో

విశాఖపట్నం: విశాఖపట్నంలోని మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతితో పాటు ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమె తల్లి మృతి చెందింది. విషయంలోకి వెళితే మధురవాడ స్వయంకృషి నగర్‌లో  దీపిక అనే యువతి తన తల్లి లక్ష్మి (43)తో కలిసి నివాసం ఉంటుంది. డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న దీపికను ప్రేమించాలని కొద్దిరోజులుగా నవీన్ అనే యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడు. అయితే ప్రేమించడం కుదరదని దీపిక తేల్చిచెప్పడంతో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నవీన్ దీపిక ఇంట్లోకి చొరబడ్డాడు.

తన వెంట తెచ్చుకున్న కత్తితో నవీన్ దీపికపై దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డువచ్చిన లక్ష్మిని అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందడంతో నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు లక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తీవ్ర గాయాలపాలైన దీపికను సమీప ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తులో భాగంగా శ్రీకాకుళం సమీపంలో నవీన్‌ను పట్టుకున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.