సంగారెడ్డి,(విజయక్రాంతి): సింగూరు ప్రాజెక్టు సమీపంలో యువ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు, హోటల్ నిర్వాహకుల కథనం ప్రకారం... సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బూసరెడ్డిపల్లి శివారులో సింగూరు ప్రాజెక్టు కట్ట సమీపంలోని హరిత రెస్టారెంట్ లో ఓ ప్రేమ జంట గురువారం సాయంత్రం రూము అద్దెకు తీసుకున్నారు. హోటల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు హోటల్ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులు నారాయణఖేడ్ పరిధి నిజాంపేట్ వాసులు ఉదయ్ కుమార్(21), మౌనిక(19)గా గుర్తించారు. తామ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.