calender_icon.png 31 October, 2024 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దులు దాటిన ప్రేమ

30-07-2024 01:21:54 AM

  1. భారత యువకుడిని పెళ్లాడిన పాకిస్థానీ యువతి 
  2. ఆరేళ్లుగా సోషల్ మీడియా వేదికగా ప్రేమాయణం 
  3. 2022 ఏడాదిలో వీడియోకాల్ ద్వారా పెళ్లి 
  4. వైరల్ అవుతున్న యువతి పోస్టు

న్యూఢిల్లీ, జూలై 29: పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ ఇండియాలోని నోయిడాకు చెందిన సచిన్ ప్రేమ కథ.. గతంలో దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమైందో మనందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ప్రేమకథకు సంబంధించిన ఓ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరో ప్రేమ జంట సరిహద్దులు దాటి పెళ్లితో ఒక్కటయ్యాయి. పాకిస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల మెహ్విష్‌కు.. భారతదేశంలోని రాజస్థాన్ బికనీర్ జిల్లాకు చెందిన రెహ్మాన్ అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి వారిద్దరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే మెహ్విష్‌కు పాకిస్థాన్‌లోని లాహోర్‌కు చెందిన వ్యక్తితో ఇదివరకే మొదటి వివాహం జరుగగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే వారి మధ్య గొడవల కారణంగా 2018లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.

తదనంతరం సోషల్ మీడియా వేదికగా భారత్‌కు చెందిన రెహ్మాన్‌తో మెహ్విషకు ఏర్పడిన పరిచయం మొదట స్నేహితులుగా.. తదనంతరం ప్రేమగా మారింది. దాదాపు నాలుగేళ్ల సుధీర్ఘ ఆన్‌లైన్ ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ 2022 ఏడాదిలో వీడియో కాల్‌లో వివాహం జరుపుకున్నారు. 2023 ఏడాదిలో మక్కా పవిత్రయాత్రలో పాల్గొన్న అనంతరం వీరిద్దరూ అధికారికంగా వివాహం చేసుకున్నారు. కగా రెహ్మాన్ కువైట్‌లో ట్రాన్స్‌పోర్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇటీవల మెహ్విష్ ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు ప్రమాణించి జూలై 25న వాఘా సరిహద్దు గుండా 45 రోజుల ఇండియా టూరిస్టు వీసా పొంది రాజస్థాన్‌లోని రెహ్మాన్ ఇంటికి చేరుకుంది. వీరిద్దరి ప్రేమ, పెళ్లిని స్వీకరించిన రెహ్మాన్ కుటుంబ సభ్యులు మరోసారి గ్రాండ్‌గా వీరి పెళ్లి వేడుకను నిర్వహించారు. తాజాగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటో, వీడియోను మెహ్విష్ ఎక్స్‌లో పోస్టు చేయగా ఇప్పుడు అది వైరల్‌గా మారింది. కంగ్రాట్స్ న్యూ కపుల్స్ అని కొందరు రిప్లు ఇవ్వగా.. జాగ్రత్త బ్రో, సరిహద్దులు దాటిన ప్రేమ, ప్రేమకు సరిహద్దులు ఉండవు.. అంటూ పలువురు నెటిజన్లు రిప్లు ఇస్తున్నారు.