calender_icon.png 25 October, 2024 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినసొంపుగా.. విజిల్ కొట్టేలా..

14-07-2024 05:23:57 AM

ఉల్లాసంగా సూర్య, చారు..

ఏ అమ్మాయికైనా చేసుకోబోయే వాడి విషయంలో కొన్ని ఆలోచనలు, అంచనాలు ఉంటాయి. చారు కూడా అందుకు మినహాయింపు కాదు. చేసేది పోలీస్ ఉద్యోగం అయినా.. తనకు వయలెన్స్ అంటే తెలియని వాడు కావాలని కోరుకుంటోంది. మరోవైపు ఆదివారం నుంచి శుక్రవారం వరకు శాంత మూర్తిగా ఉండే సూర్య, తన ఆవేశాన్నంతా తీర్చుకోవడాన్ని ‘శనివారం’ ఒక్క రోజుకే  సరిపెట్టుకుంటా అంటున్నాడు. ఆమెని మెప్పించే క్రమంలో తనకు వయలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియనట్టు నటిస్తున్నాడు.

దీనికి చారు ముసి ముసి నవ్వులు నవ్వుకుం టూ వెళ్ళిపోయింది. అయితే వీరి హృదయాల సడి గమనించిన పదకర్త సనారే, తన కలానికి పని చెబుతూ “ఉల్లాసం ఉరికే ఎదలో.. ఉరిమే ఉత్సాహమే ఊపిరిలో.. ఉప్పొంగే ఊహల జడిలో మనకే మనమే ఎవరో.. మౌనాలే మన ఊసులలో మాటే తప్పిపోయే పెదవులలో” అంటూ ఆ భావాలను పదాల్లో నిక్షిప్తం చేశారు. ‘సరిపోదా శనివారం’ కోసం జేక్స్ బిజోయ్ స్వరపరిచిన ఈ గీతం శనివారం (నిన్న) సాయంత్రం విడుదలైంది. సంజిత్ హెగ్డే, కృష్ణ లాస్య పాడిన ఈ పాట అందరి పెదవులపై పలకడం ఖాయం!

అమ్మాయి అందాల రాణి.. అబ్బాయి కోదండపాణి

‘విల్లును వంచక ఒళ్లును వంచిన ఆ కథ ఈ రాముడిది’ అంటూ ‘పురుషోత్తముడు’గా తెరమీద కనపడనున్నాడు రాజ్ తరుణ్. రాజ్ భీమన దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. యజమానురాలైన ఓ యువతి, సేవకుడిగా ఉన్న యువకుడు మధ్య జరిగే ప్రేమాయణం ఈ కథలో చూపనున్నారు దర్శకుడు. ఈ బాధ్యత తనది కూడా అంటూ ‘పచ్చ పచ్చని పసిరికతో సహవాసం కోరెను నింగి.. వెచ్చ వెచ్చని చినుకులతో తను రాలెనుగా ఇలకేగి’ వారి ప్రేమానుబంధాన్ని  పాటలో పలికించారు రచయిత పూర్ణాచారి. గోపీసుందర్ స్వరకల్పనలో ఎస్పీ చరణ్ పాడిన ఈ గీతం జానకి లాంటి అమ్మాయిని కోరుకునే వారంతా పాడుకునేలా ఉంది. అనుమానముంటే ఆలకించి చూడండి.

జాతర సందడిలో కమిటీ కుర్రోళ్ళు 

నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. కొత్తవారైన కుర్రకారుతో దర్శకుడు యదువంశీ తెరకెక్కిస్తున్నారు. చిన్న నాటి స్నేహితులైన కొందరు యువకుల కథతో రానున్న ఈ సినిమాలో అమ్మవారి జాతర నేపథ్యంలో రానున్న ‘సందడి సందడి’ అనే పాటని ఇటీవల అంతటా సందడి చేస్తున్న యువ కథానాయకుడు విష్వక్ సేన్ విడుదల చేశారు. స్వతహాగా గాయకుడైన అనుదీప్ దేవ్.. సింహాచలం మన్నెల సమకూర్చిన పదాలకి బాణీలందించడంతో పాటు  రేణు కుమార్, శ్రీనివాస్ దరిమిశెట్టితో కలిసి ఈ పాట పాడారు. ఆగస్టులో తెరమీదికి రానున్న ఈ సినిమాలో కమిటీ కుర్రోళ్ళంతా ఏకమై హుషారుగా గంతులేసిన గీతమిది. ఈ జాతర దరువులు వింటే మీకూ పూనకం వస్తుందేమో!

నవతరం జంట అనురాగం

“సున్ చెలియా. గడవదు నిను చూడక.. నిమిషిమిక” అని నభా నటేష్‌ను ఉద్దేశించి అంటున్నారు ప్రియదర్శి. ప్రేమలో పడ్డ చాలా మంది మగవాళ్ళు చెప్పే మాటిదే అన్నది ఆడవారి అభిప్రాయం. దాంపత్యంలోకి అడుగుపెట్టాక జీవితం పెనుగులాటగా మారిందని భావించే నవతరం జంట కథతో అశ్విన్ రామ్ తెరకెక్కించిన చిత్రం ‘డార్లింగ్’. ఈ నెల 19 విడుదలవుతుంది. ఒక్కటైన మనసుతో ముడిపడిన ప్రేమికుల అనురాగాన్ని తెలుపుతూ కాసర్ల శ్యామ్ రాసిన ఈ మధుర గీతాన్ని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇలాంటి పాటలకు వివేక్ సాగర్ అందించిన స్వరాలు చెవిన పడితే పదాలు మారతాయేమో కానీ పాట ఆగదు. ఆయన సంగీతాన్ని రుచి చూసినవారికి ఇది అనుభవమే. తొలిసారి విన్నవారికి నెమ్మదిగా అలవాటు అయిపోతుంది.

జీవోఏటీకి విజిలేస్కో

అగ్ర కథానాయకుల సినిమాల్లో విజిల్ వేసే పాట ఒకటైనా ఉంటుంది. ‘గోట్’ (గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్ ‘విజిల్’ పేరిట ఒక సినిమానే చేశారు. అభిమానులంతా ఆడిపాడేందుకు తన ఈ తాజా చిత్రంలో అదే పదంతో ఓ పాటని కూడా అందించారు. “శబ్దం అదిరేట్టు విజిలేస్కో.. రక్తం మరిగేట్టు విజిలేస్కో.. సిస్టం పగిలేట్టు విజిలేస్కో..” అంటూ రామజోగయ్య శాస్త్రి కలం పలికిన ఈ గీతాన్ని నకాష్ అజీజ్‌తో కలిసి స్వరకర్త యువన్ శంకర్ రాజా ఆలపించారు. రాజు సుందరం నృత్య రీతులు సమకూర్చిన ఈ పార్టీ సాంగ్‌కి విజయ్, ప్రభుదేవ, ప్రశాంత్ కలిసి చిందులేశారు. తెలుగులో యువన్ అభిమానులు చాలామంది ఉన్నారు. వారంతా ఈ పాట విన్నాక విజిలేసినా నేల విడిచి నాట్యం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. విడుదలయ్యాక థియేటర్లలో రెండూ జరిగే అవకాశమూ ఉంది.