calender_icon.png 18 November, 2024 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా ఇసుక దందా

18-11-2024 01:10:15 AM

  1. కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి అక్రమంగా తరలింపు 
  2. మామూళ్లు తీసుకున్న ఖాకీలపై వేటు
  3. ఉమ్మడి జిల్లాలో 11 మంది అధికారులకు మెమోలు
  4. శాఖా పరమైన చర్యలకు ఆదేశాలిచ్చిన డీజీపీ
  5. అయినా ఆగని ఇసుక అక్రమ రవాణా
  6. ప్రజాప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న మాఫియా!

కామారెడ్డి, నవంబర్ ౧౭ (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్న పోలీస్ అధికారులపై కొరడా ఝళిపించేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినా ఇసుక దందా మాత్రం ఆగడం లేదు.

అయితే ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారి నుంచి మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులను ఉన్నతాధికారులు గుర్తించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మంది పోలీస్ అధికారులు ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్నారని విచారణలో తెలింది. ఇందులో ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్లకు చెందిన 9 మంది ఎస్సైలు ఉండగా ఇద్దరు సీఐలు కూడా ఉన్నారు.

వీరిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చి మెమోలు జారీ చేసినా ఇసుక రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నది. సదరు పోలీస్ అధికారులను తక్షణమే బదిలీ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయినా ఇప్పటి వరకు సదరు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

బోధన్ సబ్ డివిజన్ పరిధిలో పనిచేసిన ఎస్సై, బాల్కొండ నియోజకవర్గంలో కీలకమైన స్టేషన్‌కు ఎస్‌హెచ్‌గా పోస్టింగ్ ఇచ్చారు. రుద్రుర్ సర్కిల్‌లో పనిచేస్తున్న ఓ ఎస్సై అర్ధరాత్రి ఇసుక టాక్టర్లు, లారీలకు కాపలా కాస్తూ ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ నెల మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఒక్కో ట్రాక్టర్, లారీ యజమానుల నుంచి రూ.20వేల వరకు వసూళ్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. రుద్రూర్, దర్పల్లి, డిచ్‌పల్లి, బోధన్ రూరల్ సర్కిల్‌లో పనిచేసిన ఎస్సైలపై అవినీతి ఆరోపణలు ఉండగా వీరిలో కొందరు బదిలీ అయ్యారు. మిగిలిన వారు మాత్రం పాత స్థానాల్లోనే కొనసాగుతూ ఇసుక అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. 

ప్రజాప్రతినిధుల అండ ?

మద్నూర్ మండలంలోని మంజీర పరీవాహక ప్రాంతాల నుంచి వందల లారీల్లో ఇసుకను అర్ధరాత్రి వేళ తరలిస్తున్నా.. అడ్డుపడితే తమ ప్రాణాలు పోతాయని అధికారులు జంకుతున్నారు. ఇసుకను తరలిస్తున్న వారికి ప్రజాప్రతినిధుల అండ బలంగా ఉందని బాహా టంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి ఎగనామం పెట్టి స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇస్తూ ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.