calender_icon.png 16 March, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవన పద్మవ్యూహం

16-12-2024 12:00:00 AM

తెలియని శత్రువులతో పో

రాటం సలిపే కురుక్షేత్రం జీవితం.

చిక్కుల దారులతో చికాకులకు గురిచేసే

ఆధునిక దుర్యోధన, దుశ్శాసన,

శకుని, కర్ణాదులున్న అదృశ్య కౌరవ క్రూర సైన్యంతో

యుద్ధానికి ఉబలాటపడే వారికి

ప్రతి రోజూ పద్మవ్యూహం.

క్షణక్షణానికీ చెడు వికృత చేష్టల సెగలకు

మంచి కరిగిపోతున్న ఈ పాడు లోకంలో

ఎదుటివారి ఉన్నతికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ,

ఎపుడూ వారి పతనాన్నే కోరుకునే దుర్జనులే

మహా సజ్జనులుగా చలామణి అవుతున్న

ఈ దుష్టాతిదుష్ట లోకంలో

చెల్లని రూపాయిలే నాణ్యమైన బంగరు నాణాలుగా

లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ

దర్జాగా మీసాలు మెలివేస్తూ

మహామహా రాజాలుగా ఊరేగుతున్న

ఈ మాయామేయ జగత్తులో

పచ్చని కాపురాల్లో చిచ్చుపెట్టే అసూయాగ్రస్తులే

అంతటా నిండిపోతూన్న ఈ ప్రపంచంలో

ఏ హక్కు లేకున్నా హద్దులు మీరి

ఇతరుల జీవితాలను అల్లకల్లోలం చేసే

ధూర్తులు కోకొల్లలుగా ఉన్న

ఆరోగ్యంగా జీవిస్తున్న వారి అనారోగ్యాన్ని ఆశించే

తులువలు తామర తంపరగా ఉన్న

ఈనాటి అసమ సమాజంలో

నీతి బతుకులకు

ప్రతిరోజూ పద్మవ్యూహమే. 

పులుగడిగిన ముత్యం వలె ఇంటినుండి బయటకు వెళ్ళి

శరీరమూ, మనస్సూ ఏ దుష్ప్రభావానికి లోను గాకుండా

ఎట్లా వెళ్ళిన వాడు అట్లాగే క్షేమంగా

ఇంటికి తిరిగివచ్చిన ప్రతివాడూ

ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిరావడం తెలిసిన

ఈ కాలపు అభిమన్యుడు!