calender_icon.png 13 November, 2024 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలం డీలా!

11-11-2024 01:10:19 AM

  1. విపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ వెనుకంజ 
  2. ప్రభుత్వంపై పోరులో కొరవడిన సమన్వయం
  3. రాష్ట్ర అధ్యక్షుని నియామకంలో అధిష్ఠానం తాత్సారం
  4. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్న నేతలు
  5. సత్తా చాటాలంటే ఐక్యత ముఖ్యమంటున్న శ్రేణులు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాం తి): పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి రాష్ట్రం లో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీలో ఆ ఊపు, ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. కనీసం ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు సాధించలేక చతికిలపడిన బీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఉత్సాహంగా ప్రభుత్వంపై పోరులో ముందుకు సాగుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నా ప్రతిపక్ష హోదా విషయంలో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా బీజేపీ పరిస్థితి మారిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించినా అధికా ర పార్టీపై పోరులో మాత్రం వెనకబడిపోయిందని ఆ పార్టీ నేతలే పేర్కొంటున్నారు.

ప్రభుత్వంపై పోరులో దూకుడుగా ఉండాల్సిన పార్టీ నేతల్లో ఆ లక్షణాలు కనిపించడం లేదని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. రాష్ట్ర అధ్యక్ష పదవిని భర్తీ చేయకపోవడం కూడా బీజేపీలో నిస్తేజానికి కారణంగా భావిస్తున్నారు.

మరోవైపు పార్టీలోని ఆ నలుగురు నేతలు వర్గాలుగా మారిపోయి పార్టీకి మనుగడ లేకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీలో వ్యవహారం ఇలాగే సాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం కచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

కొత్త అధ్యక్షుని నియామకంపై తాత్సారం..

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్‌ను తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అప్పటివరకు ఓ ఊపు మీదున్న పార్టీ కేడర్ ఒక్కసారిగా అయోమయానికి గురైపోయింది. కనీసం ఎన్నికల వరకైనా సంజయ్‌ను కొనసాగించాల్సిన అధిష్ఠానం.. కొందరు నేతల చెప్పుడు మాట లు విని ఆయనను తొలగించిందనే ప్రచారం నడిచింది.

ఫలితంగా అధికారంలోకి వస్తుందనే దశ నుంచి కేవలం 8 అసెంబ్లీ సీట్లకే పార్టీ పరిమితం అయ్యిందని పార్టీలోని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు జాతీయ రాజకీయ ప్రభావంతో బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయని.. సరిగ్గా అభ్యర్థులను బరిలో నిలిపి ఉంటే మరో రెండు సీట్లు అధికంగా వచ్చే అవకాశాన్ని కూడా పార్టీ కోల్పోయిందనేది పార్టీ నేతల్లో కొందరి అభిప్రాయంగా ఉంది.

ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి తనకు అధ్యక్ష బాధ్యతలు వద్దని చెప్పినా పార్టీ ఇంకా కొత్త అధ్యక్షున్ని నియమించడం లో మీనమేషాలు లెక్కిస్తోంది. సభ్యత్వ నమోదు, క్రియాశీల సభ్యత్వాల పూర్తి అయిన తర్వాతే సంస్థాగత ఎన్నికలను పూర్తి చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే పార్టీ అధ్యక్ష నియామకం పూర్తి చేసి ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు దూకుడుగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉండేది. కానీ బీజేపీ అధిష్ఠానం తీరు చూస్తే రాష్ట్రంలో పార్టీని ఎదగనిచ్చే పరిస్థితి కనిపించడంలేని విశ్లేషకులు అంటున్నారు. 

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే..

బీజేపీకి ఓట్లు వేసేందుకు ఓటర్లు సిద్ధం గా ఉన్నా.. ఆ ఓట్లను వేయించుకోవడంలో పార్టీ నేతలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారనేది ఆ పార్టీపై మొదటి నుంచి వినిపిస్తోన్న విమ ర్శ. మోదీ ఛరిష్మా, జాతీయవాదం, బీజేపీ గత పదేళ్లలో సాధించిన విజయాలు వెరసి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో విజ యం సాధించగలిగింది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లకే పరిమితమైన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీలోని నేతలే భావించడం లేదు. ఏదో అలా నడుస్తోంది అన్నట్లుగా పార్టీ వ్యవహారాలు నడిపిస్తూ పోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిక్తహస్తమే ఎదురయ్యే ప్రమాదం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

అందుకే నాయకులు ప్రజల్లో తిరు గుతూ వారి సమస్యలపై పోరు చేయాలని కోరుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యం గా పార్టీ అధ్యక్షున్ని నియమించుకుని ప్రత్యేక కార్యాచరణ తీసుకుని ప్రభుత్వంపై పోరు చేయకుంటే స్థానిక సంస్థల్లో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందనే ప్రచారం జరుగుతోంది.

అందుకే ఆ పార్టీ అధిష్ఠానం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని పార్టీ నేతలు కోరుతున్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ భవితవ్యం ఎలా ఉంటుందనే దానిపై ఆ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

ప్రభుత్వంపై పోరులో వెనుకంజ..

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్ నేతల మధ్యే మాటల తూటా లు, విమర్శనాస్త్రాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీపై దూకుడుగా ఉంటూ ప్రజల్లోకి వెళ్లాల్సిన బీజేపీ నేతలు ఆ విషయంలో వెనకబడిపోతున్నారు. రైతు రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, నిరుద్యోగుల సమస్యలు తదితర అంశాల్లో బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఎంత విరుచుకుపడినా అది ప్రజల్లోకి మాత్రం పోవడం లేదు.

రైతు రుణమాఫీ అంశంలో బీజేపీ తీసుకున్న స్టాండ్ బాగానే ఉన్నా ఆ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడంలో పార్టీ నేతలు వైఫల్యం చెందారని చెప్పవచ్చు. ముంబయిలో ఎన్నికల ప్రచా రంలో ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించినా దానిపై గట్టిగా కౌంటర్ ఇవ్వడంలోనూ పార్టీ నేతలు దృష్టి సారించకపోవడంపై పార్టీ శ్రేణులు మథనపడుతున్నాయి.

పార్టీ చేపట్టే కార్యక్రమాలకు నేతలు మొక్కుబడిగా హాజరవుతున్నారని పార్టీలో వినిపిస్తోంది. పార్టీలో పట్టు కోసం, మీడియాలో ప్రచారం కోసం పలువురు నేతలు ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తోంది.