రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన అమన్ షెరావత్
ఒలింపిక్స్‌లో పతకం సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు
ఒలింపిక్స్‌లో ఈసారి కుస్తీలో మన దేశానికి పతకం లేనట్టేనా అని అభిమానులు సంశయిస్తున్న వేళ.. హర్యానా చిన్నోడు అమన్ షెరావత్ అదరగొట్టాడు. అమన్ అంటే శాంతికి మారుపేరు.. ఆ పేరుకు తగ్గట్టే అమన్ విశ్వక్రీడల్లో శాంతియుత పద్దతిని అవలంభించి ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా దేశానికి కాంస్యం పట్టుకొచ్చాడు. 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథగా మారిన అమన్.. జీవితం ఒక యుద్ధం లాంటిది. జీవితం అనే యుద్ధాన్ని ఎదురించి ఒక పోరాట యోధుడిగా నిలిచి ఇవాళ కోట్లాది అభిమానులకు ఆదర్శంగా నిలిచాడు. ఆడుతున్న తొలి ఒలింపిక్స్‌లోనే దేశానికి పతకం తీసుకొచ్చి అమన్ తన పేరును చరితార్ధకం చేసుకున్నాడు.. అందుకే అమన్ అద్భుతః అనకుండా ఉండలేం..!
11 ఏళ్లకే అనాథగా
ఒలింపిక్స్‌లో దేశానికి కాంస్యం అందించిన రెజ్లర్ అమన్ షెరావత్ ఒక రెజ్లర్‌గానే మనకు పరిచయం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అమన్ పడిన కష్టాలు, కన్నీళ్లు పరిచయమవుతాయి. 11 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథలా మారిన అమన్.. కన్నీటి కష్టాల కడలిని దాటుకొని రెజ్లర్‌గా మారిన వైనం ఆదర్శంగా నిలుస్తోంది. 2003లో హర్యానాలోని బిరోహార్ గ్రామంలో చిన్న కుటుంబంలో అమన్ షెరావత్ జన్మించాడు. అమ్మ, నాన్నా, ఒక చెల్లి.. 11 ఏళ్లు వచ్చేవరకు అమన్ జీవితం ఇదే. 2012 బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ దేశానికి రెండో పతకం తీసుకొచ్చినప్పుడు తొమ్మిదేళ్ల పిల్లాడిగా ఉన్న అమన్.. తాను రెజ్లర్ అవ్వాలని ఆరోజే నిశ్చయించుకున్నాడు.
మొదట బురదలో రెజ్లింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రసాల్ స్టేడియంలో చేరి కుస్తీలో మరింత పట్టు సాధించే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో అమన్ జీవితంలో పెద్ద కుదుపు అనారోగ్య సమస్యలతో తల్లి మరణించగా.. బాధను తట్టుకోలేక తండ్రి మరుసటి ఏడాది తనువు చాలించాడు. 11 ఏళ్లకే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలా మారిపోయాడు. ఈ దశలో రెజ్లింగ్ వదిలేద్దామనుకున్నాడు. కానీ పెద్దనాన్న సుధీర్ షెరావత్ ఆర్థికంగా అండగా నిలిచాడు. తాతయ్య మాంగేరామ్ అమన్‌ను ప్రోత్సహించాడు.
‘నువ్వొక గొప్ప వీరుడిగా మారిన రోజు స్వర్గంలో ఉన్న నీ తల్లిదండ్రులు కూడా గర్విస్తారు’ అని తాత చెప్పిన మాటలు అమన్‌లో ఆసక్తిని రేకెత్తించాయి. ప్రత్యర్థిని కాళ్లను పట్టి కింద పడేసే టెక్నిక్‌ణు అవపోసన పట్టాడు. జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ 2018లో ప్రపంచ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో మెరిసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు.
10 గంటల్లో 4.6 కేజీలు తగ్గి
భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుతో పతకం కోల్పోయింది. దీంతో కాంస్య పతక పోరుకు సిద్ధమైన అమన్ విషయంలో ఆ పొరపాటు జరగకూడదని జట్టు మేనేజ్‌మెంట్ జాగ్రత్తలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 10 గంటల సమయంలో 4.2 కేజీలు తగ్గిన అమన్ అనర్హత వేటును తప్పించుకొని కాంస్యంతో మెరవడం విశేషం. కాగా అమన్ బరువు తగ్గడంలో సీనియర్ కోచ్‌లు జగమందర్ సింగ్, వీరేందర్ దహియాలతో పాటు సహాయ సిబ్బంది చాలా కష్టపడ్డారు.
గురువారం సెమీస్ పోరు ముగిసాకా అమన్ బరువు 61.5 కేజీలు ఉందట. దీంతో కాంస్య పోరు నాటికి తిరిగి 57 కేజీలకు రావాల్సి ఉంటుంది. కేవలం 10 గంటల సమయం మాత్రమే ఉండడంతో అమన్ చాలా కష్టపడ్డాడు. మొదట గంటపాటు వేడినీళ్ల స్నానం, ఆగకుండా గంటసేపు ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయించి జిమ్‌కు తీసుకెళ్లారు. 30 నిమిషాల బ్రేక్ అనంతరం మళ్లీ కఠిన వ్యాయామాలు, జిమ్ ఎక్సర్‌సైజులు చేయించారు. శుక్రవారం ఉదయం 4.30 గంటలకు అమన్ బరువు చూడగా.. 56.9 కేజీలకు చేరడంతో ఊపిరి పీల్చుకున్నారు.