calender_icon.png 26 December, 2024 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11 నెలలకే నమ్మకం పోయింది

08-11-2024 12:26:03 AM

  1. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత 
  2. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు అప్పులూ పుట్టట్లేదు
  3. బీఆర్‌ఎస్ పార్టీపైనా ప్రజలకు విశ్వాసం లేదు
  4. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి.. 
  5. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : ‘బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుందాం. రానున్న నాలుగేళ్లు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దాం. పార్టీని మరింత పటిష్టం చేసుకుని వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగురేద్దాం’ అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్ని ఒక వైపు దివాళా తీసే పరిస్థితి ఉందని, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయని, ఆ రాష్ట్రాలకు అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని ఆరోపించారు. 11 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందాన తయారైందని అన్నారు.

గురువారం సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్‌షాప్‌నకు రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్‌బన్సల్ , ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తదితరలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ.. బీజేపీకి సంస్థాగత ఎన్నికల వ్యవస్థనే ఊపిరి అని, మహిళా, యువత, రైతుల తో పాటు ఇతర ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే..

మరోవైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, హామీల వైఫల్యంపై నిలదీయాలని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం కనిపించడం లేదని ఎద్దేవాచేశారు. బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోయిందని అన్నారు.  

31 లక్షల సభ్యత్వం సేకరణ 

ప్రపంచంలోనే అత్యధిక సభ్యులన్న పార్టీ బీజేపీయేనని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. రెండేళ్లకోసారి గ్రామస్థాయి నుంచి సంస్థాగత ఎన్నికలను నిర్వహించుకునే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. పదేళ్లకోసారి సభ్యత్వ నమోదు చేసేది కూడా తమ పార్టీనేనని ఉద్ఘాటించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 31 లక్షల సభ్యత్వ సేకరణ పూర్తయిందని వివరించారు. ఈ నెల 15 వరకు సభ్య త్వ నమోదు ఉన్నందున.. ఇంకా సభ్యత్వ సేకరణను పెంచాలని కిషన్‌రెడ్డి సూచించారు.  

గ్యారెంటీలపై చేతులెత్తిన కాంగ్రెస్ 

తెలంగాణలో బీఆర్‌ఎస్ అహంకారపూరితంగా పాలించిందని, దోపిడీ చేసిందని భావించిన ప్రజలు.. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకుండా చేతులెత్తేసిందని, ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, రూ.4 వేల పెన్షన్, గృహ నిర్మాణాలకు భూమి పూజ చేయలేదని, అప్పులు మాత్రం విపరీతంగా చేశారని అన్నారు.

కేసీఆర్ హయాంలో రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏ భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవాలని చూస్తోందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వైపు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు.  

చివరి గింజ వరకు కొంటాం 

కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, అందుకు ఎన్ని వేల కోట్లు అయినా ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మధ్యవర్తులు, మిల్లర్లు, దళారులతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రూపాయి కూడా భారం పడనీయదని చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కోట లు దాటుతున్నాయని, పనులు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవాచేశారు. తెలంగాణలో హామీలన్ని అమలు చేస్తున్నామని మహారాష్ట్రకు వెళ్లి చెప్పుకొంటున్నారని విమర్శించారు. దేశంలో కుటుంబాల పాలన నడుస్తోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ మొదలు తమిళనాడు వరకు కొడుకు, అల్లుడు, బిడ్డ లాంటి విధానం కొనసాగుతోందని.. ఈ విధానానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని, అందుకు ప్రతీ ఒక్కరూ గర్వపడాలన్నారు. 

రాజకీయ లబ్ధి కోసమే కుల గణన : డీకే అరుణ 

రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. కుల గణనలో వ్యక్తిగత నిబంధనలకు విరుద్ధమైన ప్రశ్నావలి ఉందని, ప్రజల ఆస్తులు, అప్పులు, భూములు, వ్యక్తిగత వివరాలు అవసరమా? ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారనే సమాచారం ఎందుకు? అసలు ఈ సర్వే ఎందుకోసమో స్పష్టం చేయాలి? అని డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గతంలో కేసీఆర్ సర్కార్ చేసిన సర్వే నివేదికను బయటపెట్టాలని అన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా, కల్యాణలక్ష్మికి తులం బంగారం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. 

జిల్లా, మండల స్థాయిల్లోనూ వర్క్‌షాప్‌లు 

బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్‌షాప్‌లు, పలు అంశాలపై కిషన్‌రెడ్డి చర్చించారు. ప్రస్తుత రాజకీయాలు, పార్టీ సంస్థాగతంగా బలోపేతం, అందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై కీలక చర్చుల జరిపారు. ఈ నెల 9,10,11 తేదీల్లో జిల్లా స్థాయిలో, 12,13,14 తేదీల్లో మండల స్థాయిలో పార్టీ వర్క్‌షాపులు నిర్వహించాలని నిర్ణయించారు.

ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోం 

మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, ప్రక్షాళన చేయాల్సిందే నని, నీళ్లు కూడా ఇవ్వాలని కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి అన్నారు. కానీ, మూసీ ప్రక్షాళన పేరుతో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకొనేది లేదని స్పష్టంచేశారు.

మూసీకి ఇరువైపుల రిటైనింగ్ వాల్ కట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని సూచించారు. కుల గణనకు తాము వ్యతిరేకం కాదని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన డీఎన్‌ఏ ఎంటో ప్రజలకు తెలుసని, ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు.