మహబూబ్‌నగర్, విజయక్రాంతి :
‘స్వరాష్ట్రం సాధించుకుందాం.. పాలమూరు కరువును పారదోలి పండుగ చేసుకుందాం.. ఇలా ఎన్నో ఆశలతో తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టిన. కల నెరవేరిన రోజు నా జన్మకు అర్థం పరమార్థం లభించింది అనుకున్న. ఇక జీవితంలో మరేమీ సాధించాల్సిన అవసరం లేదని భావించా.
గడిచిన పదేండ్లు స్మరించుకుంటే గిందుకా అనిపిస్తోంది. నాడు ప్రాణం పోయినా పర్వాలేదు అనేలా ఉద్యమం చేసేంత ఆవేదన నాలో ఉండేది’ అంటూ మహబూబ్‌నగర్‌కు చెందిన మలిదశ ఉద్యమకారుడు మోసిన్‌ఖాన్ ఆనాటి ఉద్యమ సంగతులను వివరించాడు.
నాడు ఉద్యమ ఎజెండా ఎత్తుకున్నవారు చాలా తక్కువ. టీడీపీ పార్టీలో ఉన్న నాలాంటివాళ్లు స్వరాష్ట్రం కోసం ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో చేరాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎంతో శ్రమించా. అయితే ఉద్యమ సమయంలో ఆర్థికంగా బాగా ఉన్నవాడ్ని. ఉద్యమ నేతలు, జేఏసీ నాయకులు ఏ పిలుపునిచ్చానా నిమిషం ఆలస్యం చేయకుండా మహబూబ్‌నగర్‌లో బహిరంగ సభలు పెట్టా.
ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కోల్లాపూర్‌లో బహిరంగ సభ పెట్టాడు. నాతో పాటు మరింత మంది ఉద్యమకారులు తెలంగాణ కండువాలను దాచుకొని సభకు హాజరయ్యాం. నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశాం. పోలీసులు మమల్ని కింద పడేసి బూటు కాళ్లతో ముఖాలపై తొక్కారు. ఆ గాయాలు ఇప్పటికీ మరచిపోలేం.
ఆస్తులు పోగొట్టుకొని..
ఉమ్మడి రాష్ట్ర మంత్రుల పర్యటన జరుగాలంటే పింక్ పార్టీ వ్యక్తులను ఆరెస్టు చేసిన తర్వాతే మంత్రుల పర్యటన ఉండేది. అంతలా ఉద్యమన్ని ముందుకు నడిపించా. ఈ క్రమంలో కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం ఉద్యమ సమయంలో పోగొట్టుకున్నా. చివరకు బండల షాపు పెట్టుకున్న. సరిపోని సంపాదనతో కాలం వెళ్లదీశా.
‘తెలంగాణ స్వరాష్ట్రం’ అంటూ పరిమితికి మించి ఖర్చు చేసి నేడు నా బిడ్డలకు ఏమి లేకుండా సర్వం కోల్పోయా. ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు నమోదైనవి. పోలీస్ స్టేషన్ల చుట్టు తిరిగి ఆర్థికంగా మరింత నష్టపోయా. ఎంతో శ్రమించినా ఉద్యమకారుడిగా కనీసం గుర్తించలేదు.
స్వరాష్ట్రం రాకముందు అధికారంలో ఉండి పదవులు అనుభవించినవారు.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా మళ్లీ పదవులు అనుభవించారు. కానీ మాలాంటివాళ్లకు కనీస గుర్తింపు ఇవ్వలే. ఉద్యమకారుల వేదన మాటల్లో చెప్పలేనిది.
ఉద్యమకారులను ఆదుకోవాలి
రాష్ట్రం వచ్చిన తర్వాత మా జీవితాలు మారుతాయ్ అనుకున్న. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కడుపు మాడ్చుకొని తెలంగాణ వస్తే చాలు అనుకున్నాం. కానీ ప్రత్యేక రాష్ట్రంలోనూ నాలాంటివాళ్ల జీవితాలు బాగుపడలేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి అసలైన ఉద్యమకారులను ఆదుకోవాలి.
మోసిన్‌ఖాన్