డ్రాగన్ ఫ్రూట్స్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి
ఎల్బీనగర్, జూలై 14: బాటసింగారం మార్కెట్‌లో లైసెన్స్ లేని ఏజెంట్లతో డ్రాగన్ ఫ్రూట్స్ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్, తెలుగు డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వనేపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఆదివారం ఎన్టీఆర్‌నగర్‌లోని మార్కెట్‌లో ఉద్యోగుల కమిటీ భవనంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. బాటసిం గారం మార్కెట్‌కు ప్రతిరోజు రైతులు పెద్ద ఎత్తున్న డ్రాగన్ ఫ్రూట్స్ తెస్తున్నారని తెలిపారు.
కానీ, రైతుల నుంచి అక్రమంగా లైసెన్స్ లేని ఏ జెంట్లు భారీగా నగదు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత సీజన్‌లో కూడా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నదన్నారు. బాటసింగారం మార్కెట్‌లో డ్రాగన్ ఫ్రూట్స్ విక్రయించే రైతులకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కోరారు. రైతులు మార్కెట్ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనంతరం రైతులు తమ సమస్యలపై మార్కెట్ సెకట్రరీ చిలుక నర్సింహరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. సమావేశంలో డ్రాగన్ ఫ్రూట్స్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్, ఉపాధ్యక్షుడు యాదగిరి, కోశాధికారి అనిల్‌కుమార్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.