సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మొబైల్ ఫోన్ల వాడకంతో చదివే అలవాటు కోల్పోతున్నారని సీనియర్ పాత్రికేయులు కే శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంత్రం లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియంలోని బుక్‌ఫెయిర్ ప్రాంగణం వరకు పాఠశాల విద్యార్థులతో చేపట్టిన పుస్తకనడక కార్యక్రమాన్ని ఆయన జెండాఊపి ప్రారంభించారు. అనంతరం బుక్‌ఫెయిర్ ప్రాంగణంలో నిర్వహించిన సభలో కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. చదివే అలవాటు తగ్గిపోతున్నందునే పుస్తకాలను చదవండి అనే ప్రత్యేక నినాదాన్ని ఇస్తున్నట్లు చెప్పారు.
సీనియర్ పాత్రికేయులు అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఉద్వేగపరిచే కవిత్వాలు, ఆలోచనలు, రకరకాల దృక్పథాలను ఒకదగ్గర చేర్చే కూడలి పుస్తకమని అన్నారు. ఐజీ రమేష్ మాట్లాడుతూ.. తాను సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించి, వాట్సప్ గ్రూపుల్లో నుంచి వైదొలిగి రోజూ 3పుస్తకాలు కొని చదువుతన్నానని చెప్పారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ.. లైబ్రరీలో పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగు తున్నప్పటికీ అందులో పోటీ పరీక్షల కోసం చదివేవారే ఎక్కువగా ఉంటున్నారన్నారు. పుస్తకాలు చదివే అలవాటును పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా పుస్తక మహోత్సవాలు ఉపయోగపడుతున్నాయని ఎమెస్కో ప్రసా ద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, సెక్రటరీ వాసు, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, శోభన్‌బాబు, కోశాధికారి నారాయణరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అరుణతార ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
సాయిబాబా స్మృతిలో అరుణతార అనే ప్రత్యేక సంచికను బుక్ ఫెయిర్ ప్రాంగణంలో సాయిబాబా సోదరుడు రామ దేవుడు, నందిని సిధారెడ్డి, తయమ్మ కరుణ, శివరాత్రి సుధాకర్‌తో కలిసి విరసం వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణాబాయి ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. హక్కులను సాధించడానికి ఉద్యమాలు ఎంతో అవసరమన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు,శాశ్వత ప్రయోజనాల కోసం ఉద్యమాల ఆవశ్యకతను సాయిబాబా అందరిముందుంచారని చెప్పారు.