calender_icon.png 27 October, 2024 | 6:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగుల ప్రశ్నలకు సహనం కోల్పోతున్నారు

13-07-2024 12:57:12 AM

  • అలా అయితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ 
  • బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి):  రాష్ట్రంలో నిరుద్యోగులు తమ సమస్యలపై ప్రశ్నిస్తే సీఎం, మంత్రులు సహనం కోల్పో యి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన జాబ్ క్యాలండర్ హామీ ఏమైందని, మెగా డీఎస్సీ గురించి గుర్తు చేస్తుంటే.. వారికి ముఖ్యమంత్రి, మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కాంగ్రెస్ వైఖరి ఉందని, ఆపార్టీ మాదిరిగా బీఆర్‌ఎస్ నిరుద్యోగుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయదని హితవు పలికారు.

నిరుద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నేతలు డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్ విషయంలో 1: 100 పిలుస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలే గతంలో చెప్పారని, డిప్యూటీ సీఎం భట్టి కూడా స్వయంగా అసెంబ్లీలో డిమాండ్ చేశారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ఇచ్చామని అబద్దాలు చెబుతున్నారని, మంత్రి పొన్నం ఎన్నికల కోడ్ కారణంగా జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయామన్నారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలో ఇస్తామని,  ఏడు నెలలు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వలేదని, కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో 30వేల ఉద్యోగాలు భర్తీ చేసి తామే భర్తీ చేశామని సిగ్గు లేకుండా చెబుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్‌లో చెప్పిన ప్రకారం ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ఈప్రభుత్వంలో సీఎం, మంత్రులకు, అధికారులకు సమన్వ యం లేదని, ఆర్టీసీ ఉద్యోగాల విషయంలో మంత్రి మాటలకు, ఎండీ మాటలకు పొంతన లేదన్నారు.