calender_icon.png 25 September, 2024 | 1:58 PM

ఆస్కార్ బరిలో లాపతా లేడీస్

24-09-2024 02:03:11 AM

కమర్షియల్‌గా వర్క్ అవుట్ అయ్యే సినిమాలు కొన్నైతే, ఇంకొన్ని మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీలతో తెరకెక్కిన చిత్రాలు. థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా అవి ప్రేక్షకుల మైండ్‌లో గూడు కట్టుకుపోయే కథలెన్ని?! అలాంటి సినిమాలు ప్రస్తుతం చాలా తక్కువగా ఉంటాయి. కొంతమంది వాటిని అవార్డు విన్నింగ్ సినిమాలు అని పిలుస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా అలాంటి రేర్ పీస్‌లలో ఒకటే ‘లాపతా లేడీస్’. అంటే ’జాడలేని మహిళలు’ అని అర్ధం. ఆస్కార్‌కు అధికారికంగా ఎంట్రీ ఇవ్వడంతో ఈ ’లాపతా లేడీస్’ సినిమాపై ఫోకస్ మరింత ఎక్కువ అయ్యింది. అసలు ఏం సినిమా ఇది..? కథ ఏంటి..? ఆస్కార్ కు పంపించేంత మ్యాటర్ ఇందులో ఏముంది..? 

ఓసారి చూద్దాం...

బాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ‘లాపతా లేడీస్’ ఒకటి. ఆమిర్‌ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ్, నితాన్షీ గోయెల్, హీరోహీరోయిన్లుగా నటించారు. ‘రేసుగుర్రం’ ఫేమ్ రవికిషన్ కీలక పాత్ర పోషించాడు. మార్చి 1న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. కమర్షిల్‌గా వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుందీ చిత్రం. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సైతం అందుకున్నది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా.. కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. 

ఇద్దరు పెళ్లికూతుళ్లు తప్పిపోయిన సంఘటన ఆధారంగా...

2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కొత్తగా పెళ్లయిన ఓ జంట వివాహానంతరం ఇంటికి వస్తుండగా మధ్యలో తన భార్య మిస్ అవుతుంది. అయితే ఈ విషయం తెలియక వరుడు తన భార్య అనుకుని వేరొకరి భార్యను ఇంటికి తీసుకువస్తాడు. తీరా ఇంటికి వచ్చి చూసి, తన భార్య కాదని తెలుసుకొని షాక్ అవుతాడు. దీంతో తన భార్య పోయిందని పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ ఇస్తాడు. అయితే తన భార్య ఎలా మిస్ అయ్యింది? తన భార్య స్థానంలో వచ్చిన అమ్మాయి ఎవరు? ఆ తర్వాత ఏర్పడిన పరిస్థితులేంటి? అనే కథతో ఈ సినిమా వచ్చింది.

ఆమిర్‌ఖాన్‌కు ’లాపతా లేడీస్’కు సంబంధమేంటి? 

స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ రంట, రవికిషన్, ఛాయా కదమ్, దుర్గేశ్ కుమార్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన  చిత్రం ‘లాపతా లేడీస్’. ఈ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే  కేవలం హిందీ భాషలో మాత్రమే ఉండడంతో చాలామంది తెలుగువారు ఈ సినిమాను చూడలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వడంతో తెలుగువారు సైతం ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

కథ ఏంటంటే..? 

రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో  పేదింటివారు పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి అంటే.. కట్నం  ఇవ్వలేక.. గంతకు తగ్గ బొంతలా ఎవరో ఒక పెళ్లి కొడుకును చూస్తారు.. పెళ్లి కూతురుకు అసలు అబ్బాయి ఎవరు..?  ఏంటి..? ఏం చేస్తాడు..? వారి ఊరు ఏంటి..? ఏదీ చెప్పరు. పెద్దవాళ్లు పెళ్లి అనగానే.. ముఖంపై ముసుగు వేసుకొని పెళ్లి పీటల మీద కూర్చోవడం, తాళి కట్టించుకొని.. భర్తతో వెళ్లిపోవడం మాత్రమే అమ్మాయి పని. అలా 2001 సంవత్సరంలో నిర్మల్ ప్రదేశ్ అనే గ్రామంలో ఒకేరోజు చాలామంది పెళ్లిళ్లు జరుగుతాయి. అందులో రెండు జంటలే ఈ కథలో హీరోహీరోయిన్లు.

దీపక్ (స్పర్శ్ శ్రీవాస్తవ్) అనే ఒక రైతు ఫూల్ (నితాన్షి గోయల్)ను వివాహమాడి తన ఊరికి తీసుకెళ్లడానికి బస్సు ఎక్కుతాడు. అదే బస్సులో చాలా జంటలు ఉంటాయి. పెళ్లి కూతుళ్లంతా ముఖానికి ఒకే విధమైన ముసుగును ధరించి ఉంటారు. ఇక అదే బస్సులో జయ (ప్రతిభ రంటా) కూడా తన భర్తతో అత్తారింటికి వెళ్తూ ఉంటుంది. బస్సు కదిలే కొద్దీ.. దీపక్ నిద్రలోకి జారుకుంటాడు. ఇక తమ ఊరు వచ్చి ఇంటికి చేరుకున్న తర్వాత.. ముసుగు తీసి చూస్తే పూల్ స్థానంలో జయ ఉంటుంది.

ముఖాలపై ముసుగు ఉండడంతో.. ఎవరు తన భార్య అని పోల్చుకోలేక దీపక్.. పూల్ కు బదులు జయను తీసుకోస్తాడు. ఇక భర్త ముఖాన్ని మాత్రమే చూసిన పూల్.. స్టేషన్ వద్ద ఏడుస్తూ అతని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంకోపక్క జయ భర్త.. తన భార్య పారిపోయారని ప్రచారం చేస్తుంటాడు. జయ మాత్రం తన భర్త దీపక్ కాదు అని తెలిసినా అక్కడే ఉండాలనుకుంటుంది. మరి స్టేషన్ లో ఉన్న పూల్ పరిస్థితి ఏంటి? జయ ఎందుకు దీపక్ ఇంట్లోనే ఉంటుంది? చివరికి ఈ రెండు జంటల గురించి నిజం తెలుస్తుందా..? లేదా..? అనేది సినిమా కథ. 

సాదాసీదా కథ కాదు.. 

ఇండియాలో అత్యంత నిరక్షరాస్యత ఉన్న రాష్ట్రాలు అంటే.. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అనే చెప్పాలి. ఇక్కడ చదువు ఉండదు.. పేదరికం, పిల్లలను కనడం మాత్రమే తెలుసు.. వారిని పెంచడం తెలియదు. తెలియడం కాదు కానీ, అంత స్థోమత లేదు. అమ్మాయిలకు ఒక వయస్సు వచ్చాక.. ఇంటి నుంచి ఎప్పుడెప్పుడు పంపించేయాలా అని చూస్తారు. ఇక అమ్మాయిలు కూడా అంతే. పెద్దలు చెప్పింది చేయడం తప్ప వారికి వేరే గత్యంతరం లేదు. ఇదే విషయాన్ని ‘లాపతా లేడీస్’లో చూపించారు. అభంశుభం తెలియని ఆడపిల్ల పూల్.. భర్త ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పగానే అతడే తన ప్రపంచం అనుకుంటుంది. అడిగిన వెంటనే నగలు ఇచ్చేస్తుంది.

అత్తారింటికి వెళ్లి  కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటుంది. కానీ, ఆ ఆడపిల్ల.. భర్త పక్కన లేకుండా ఒంటరిగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో చూపించినప్పుడు.. ఆమెపై కాదు ఆమెను అలా పెంచిన తల్లిదండ్రులపై కోపం వస్తుంది. ఇంకోపక్క జయ.. ఇష్టం లేని పెళ్లికి తలవంచి భర్తతో వెళ్లినప్పుడు.. అతడికి తనకన్నా తన నగలపైనే కన్ను ఎక్కువ అని తెలిసి ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు.. భర్త నుంచి తప్పించుకొనే దారిలా దీపక్ ఇల్లు కనిపిస్తుంది. తన నగలను అమ్మి చదువుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.  ఇండస్ట్రీలో ఎప్పుడు చెప్పే మాటనే.. కథ బావుండాలే కానీ, క్యాస్టింగ్ తో పెద్ద పనిలేదు. అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ అంటే ‘లాపతా లేడీస్’ అనే చెప్పాలి.

ఒక్క మాటలో చెప్పాలంటే ’లాపతా లేడీస్’ సాదాసీదా కథ కాదు.. అలాగని మరీ మెసేజ్ ఇచ్చేంత మూవీ కూడా కాదు. కాకపోతే మనుషులు, మనసులు కలిసినప్పుడే మనువు జరగాలి.. లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని చెప్పే ప్రయత్నంలో రూపుదిద్దుకున్నదే ఈ సినిమా. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఎన్నో అవార్డులను అందుకుంది. ఇక ఆస్కార్ లో కూడా విజయం అందుకుంటుందేమో చూడాలి. 97వ ఆస్కార్ వేడుకలు వచ్చే మార్చిలో జరగనున్నాయి. 

11 ఏళ్ల తర్వాత కిరణ్‌రావు విజయం..

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన కిరణ్‌రావు.. 2011లో ఆమిర్ఖాన్ హీరోగా ’ధోభీఘాట్’ అనే చిత్రంతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత తాజాగా చర్చించుకుంటున్న ‘లాపతా లేడీస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇద్దరు ఆడవాళ్ల మానసిక పరిస్థితిని, వారు ఎదుర్కొన్న కష్టాలను.. చివరికి వారు చేరుకున్న గమ్యాన్ని డైరెక్టర్ కిరణ్‌రావు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇండియా రోజురోజుకు ఎన్ని కొత్త రంగులు పులుముకుంటున్నా..  ఇంకా ఇలాంటి ప్రదేశాల్లో ఆడవారి పరిస్థితి ఇది అని చెప్పకనే చెప్పుకొచ్చిన తీరు అద్భుతం.

సమాజంలో ఆడవారి కట్టుబాట్లు, సంప్రదాయాల పేరుతో కఠిన శిక్షలు, ఆచారాలు.. ఇలాంటివన్నీ నవ్విస్తూనే చురకలు పెట్టేలా ఉన్నాయి. 11 ఏళ్ల తర్వాత కూడా ఆమె తన సత్తా చాటింది కిరణ్‌రావు. కాగా, రెండు రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తమ చిత్రం ఆస్కార్ వేదికపై మనదేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది తనతోపాటు చిత్రబృందం కోరిక అని వెల్లడించారు. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తనవంతు బాధ్యతగా ఆస్కార్‌కు పంపిస్తుందనే నమ్మకం ఉందని కూడా ఆమె చెప్పుకొచ్చారు.