25-02-2025 07:53:11 PM
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. మణుగూరు పట్టణంలోని ఎమ్మెల్యే పాలెం స్వగృహంలో మంగళవారం మర్యాదపూర్వకంగా మణుగూరు లారీ ఓనర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కలిశారు. సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ ఓనర్ల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ 2004లో ఏర్పాటు చేసుకున్నామని, మొదట్లో 780 లారీలు 425 మంది ఓనర్లు ఉండేవారన్నారు. ఆ సంఖ్య నేడు 231 మంది లారీ యజమానులు, 380 లారీలకు తగ్గిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బొగ్గులోడి లారీలకు సక్రమంగా ఇవ్వకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో పలుమార్లు ఏరియా సింగరేణి జిఎంలతోపాటు డైరెక్టర్లకు లారీ ఓనర్ల ధైర్య స్థితిని తెలిపిన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదని విచారం వ్యక్తం చేశారు. బొగ్గు లోడింగులు సక్రమంగా లేకపోవడం కారణంగానే కొంతమంది ఊరు వదిలి వెళ్లిపోయారని మరికొందరు లారీలను అమ్ముకున్నారని, మరికొందరు ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారనీ ఆవేదనను వెలిబుచ్చారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం ప్రతిరోజు 2,500 టన్నుల నుండి 3,500 టన్నుల వరకు రోడ్డు రవాణా ధ్వారా పరిశ్రమలకు బొగ్గు తరలించేటట్టు మాకు అవకాశం కల్పించాలని, సింగరేణి మాజీ కార్మికుల పిల్లలు, భూ నిర్వాసితుల పిల్లలు ఉద్యోగ అవకాశాలు లేక లారీలు కొనుక్కుని లోడింగ్ లేక అనేక ఇబ్బందులు పడుతూ టాక్స్ లు, ఇన్సూరెన్స్ లు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
మణుగూరు సింగరేణి యాజమాన్యం రోజుకి 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోందని చెప్తూనే ఆరు వ్యాగన్ల ద్వారా 22,000 వేల టన్నులు, మణుగూరు BTPSకు 16,000 వేల టన్నుల బొగ్గు సరఫరా చేస్తున్నట్లుగా చెబుతున్నారన్నారు. అసోసియేషన్ లో ఉన్న లారీలకు బొగ్గు తోలకం అవకాశం కల్పించకపోవడంతో లారీలకు ఫైనాన్స్ కట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ లారీలను నమ్ముకుని ఎలక్ట్రిషన్, కట్టల మేస్త్రీలు, మెకానికులు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు, టైర్ పంచర్ వర్కర్లు, వెల్డింగ్ షాపులు, బొగ్గు ముఠా కార్మికులు ఇలా సుమారు 10 వేల కుటుంబాలకు పైగా ఈ లారీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. సింగరేణి యాజమాన్యం లోడింగ్ కల్పించకపోతే పై ఉన్న కుటుంబాల వారందరూ కూడా వీధిలో పడే పరిస్థితి ఏర్పడుతుందని, సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి మణుగూరు లారీలకు ప్రతి రోజు 1,500 నుంచి 3,000 టన్నుల బొగ్గు తోలకం అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే పాయం ను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే పాయం సింగరేణి అధికారులతో ఫోన్ లో మాట్లాడి మణుగూరులో ఉన్న లారీ ఓనర్స్ లోడింగ్ లేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే లారీలకు లోడింగ్ కల్పించాలని సింగరేణి అధికారులు ఆదేశించారు. సింగరేణి అధికారులు స్పందించి రేపటి నుంచి లారీలకు లోడింగ్ కల్పించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యేకు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారన్నారు. అసోసియేషన్ సమస్యపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పాయంకు మణుగూరు లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు బాల సత్యనారాయణ, సెక్రటరీ మేరెడ్డి సురేందర్ రెడ్డి, లారీ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు.