calender_icon.png 22 February, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిషేకంతోనే శివుడు అనుగ్రహిస్తాడు

22-02-2025 01:48:50 AM

శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ 

జగిత్యాల, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): ‘శివుడు అభిషేక ప్రియుడు’ కాబట్టి కేవలం భక్తితో అభిషేకం చేస్తే చాలు తృప్తి చెంది, ఆ పరమేశ్వరుడు మనలను అనుగ్రహిస్తాడని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో జరుగుతున్న శ్రీలింగ మహాపురాణ సప్తాహంలో భాగంగా శుక్రవారం 3వ రోజు ప్రవచనం భక్తులను అలరించింది.

షోడశోపచార, పంచోపచార, అలంకార సేవలు ఏమి లేకుండా, శుద్ధ జలంతో ‘ఓం నమశ్శివాయ’ అంటూ మనస్ఫూర్తిగా అభిషేకిస్తే చాలు ఆ పరమశివుడు ప్రసన్నమవుతాడని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. మృత్యువుకే మృత్యువైన శంకరుని పూజిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోయి పూర్ణాయుష్షు చేకూరుతుందని శ్రీలింగ మహాపురాణంలో చెప్పబడిందన్నారు. స్వయంగా పరమేశ్వరుడే ఆత్మ లింగంగా కొన్నిచోట్ల అవతరిస్తే, కొన్నిచోట్ల దేవాది దేవతలు ప్రతిష్ఠిస్తే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు వెలిసాయన్నారు.

వాటన్నింటిలోకెల్లా వారణాసిగా, కాశీ మహానగరంగా కీర్తించబడ్డ క్షేత్రం అత్యంత ప్రశస్తమైనదన్నారు. బ్రహ్మ సృష్టించిన ఈ లోకమంతా అంతమైనా కూడా శివుడు సృష్టించిన కాశీ పట్టణం మాత్రం అలాగే ఉంటుందని, అందుకే అంత్యకాలములో కాశీలో మరణించాలని, చనిపోయిన వారి అస్తికలు కాశీలోని గంగలో కలపాలని సనాతన ధర్మం చెబుతుందన్నారు. అంతటి మహత్తు కలిగిన పరమేశ్వరుని పూజిస్తే నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అన్ని కష్టాలు దూరమై, సుఖ సంతోషాలతో ఉండగలమని మహేశ్వరశర్మ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష, కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్ మోటూరి రాజేంద్రప్రసాద్,   నిర్వాహకులు వనపర్తి చంద్రం, నీలి కాశీనాథ్, వొటారి చిన్న రాజన్న, మంచాల రాజలింగం, రాచకొండ దేవ భూమయ్య, పొద్దుటూరి జలంధర్, రుద్ర సుధాకర్, శక్కరి అశోక్, రేగుల భూమానందం, శ్రీహరి, బెజ్జారపు చందు  పాల్గొన్నారు.