calender_icon.png 1 January, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలని గణపతి దేవుడు

04-11-2024 12:00:00 AM

వేమనను ప్రభావితం చేసిన పూర్వకవి :

“ప్రమదముతో నొకింతయిన 

బాత్రునకీని మహాఫలం బగున్

బ్రమసి యపార విత్తములపాత్రునకిచ్చిన 

గీడు పొందు, ఘా

సము నొసంగగ దుగ్ధము 

జాలగ ధేనువులిచ్చు నట్టి దు

గ్ధము లొసగన్ విసంబొలుకు 

గాదె భుజంగమ యూధమిమ్మహిన్.”

అంటూ గొప్ప లోకనీతిని బోధించిన ఈ పద్యం కొలని గణపతి దేవుడు రచించిన ‘శివయోగ సారము’లోనిది. ధనాన్ని దానం చేసే సందర్భంలో దానం చేస్తున్న వ్యక్తి పాత్రులకే దానం చెయ్యాలి తప్ప అపాత్రులకు, అనర్హులకు చేయరాదని చెబుతూ, అపాత్రులు కొన్నిసార్లు దాతలకు కీడు తలపెట్టడానికి కూడా వెనకాడరని గొప్ప ఉదాహరణాన్ని కవి ఈ పద్యంలో చెప్పాడు.

ఆవులకు గడ్డి పెట్టినా చిక్కని పాలిస్తాయి. కాని, పాములకు పాలు పోసినా విషమే కక్కుతాయి. అందుకే, పాత్రతనెరిగి దానం చెయ్యాలన్న నీతిని బోధిస్తుంది ఈ పద్యం. ఈ విధంగా లోకంలో అందరికీ జ్ఞానోదయం కలిగించే నీతులెన్నో ఈ ‘శివయోగ సారం’లో కవి నిబద్ధించాడు. 

విపులంగా ఇందులూరి వంశచరిత్ర 

కొలని గణపతి దేవుడు రచించిన ‘శివయోగ సారము’ పీఠికలో ఇందులూరి అన్నయమంత్రి వంశచరిత్ర విపులంగా వర్ణితమైంది. అయితే, ఈ కొలని గణపతి దేవుడు ఇందులూరి వారి వంశచరిత్రను ఇంత విపులంగా రాయడానికి కారణం అది ఆయన వంశచరిత్ర కావడమే తప్ప, మరొకటి కాదు. కొలని వారందరూ ఇందులూరి వారే.

ఈయనకు పూర్వుడైన ఇందులూరి సోమన్న ‘కొలనువీడు’ దుర్గాన్ని సాధించి సొంతం చేసుకున్న కారణంగా నాటి కాకతీయ చక్రవర్తి అయిన గణపతి దేవుడు అతనిని ‘కొలను సోమన్న’గా వ్యవహరించడం వల్ల క్రమంగా వారందరూ కొలని (కొలను) వారయ్యారు. ఈ కొలను సోమన్నకు ఐదవ తరం వాడే కొలని గణపతి దేవుడు.

‘శివయోగ సారము’, ‘మనో బోధ’ 

కొలని గణపతి దేవుడు ‘శివయోగ సారము’, ‘మనో బోధ’ అనే రెండు గ్రంథాలు రచించినట్లు తెలుస్తున్నది. ‘శివయోగ సారము’ ఒక సంస్కృత గ్రంథానికి అనువాదమని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఈ గ్రంథం పూర్వభాగంలో 8 ఆశ్వాసాలు, ఉత్తర భాగంలో 4 ఆశ్వాసాలు ఉన్నాయి. ఈ ‘శివయోగ సారము’ రచనకు పూర్వం కొలని గణపతి దేవుడు దేశి తెలుగులో నాటకాలు మొదలైన రచనలు కూడా చేసినట్లు తెలుస్తున్నది. ఈ గ్రంథంలోని అవతారికలోనే ఆయన గురువు పలికిన

“మరియును శివపరమున

నెరయు కృతుల నాటకముల నేర్పు జనులం

దరు నౌనౌనని పొగడ

కరకంఠునికరుణ రచనకావింతిలన్‌”

అన్న మాటలనుబట్టి ఈ కవి ‘శివయోగ సారాని’కి పూర్వం మరికొన్ని కృతులు, నాటకాలనూ రచించినట్లు అర్థమవుతున్నది. 

అంతేగాక, అవి జనంలో గొప్ప గౌరవాన్ని పొందిన రచనలని కూడా తెలుస్తున్నది. ఈయన రచనలన్నీ దేశి తెనుగులోనే ఉన్నాయని వీటికంటే పూర్వపద్యంలో గురువే చెప్పిన మాటలు సాక్ష్యమిస్తున్నాయి. ‘పశుపాశపతి జ్ఞానము’ అని ప్రారంభించే ఈ పద్యంలో “నీకృతుల సదృశగతి చెప్పి దేశి తెనుగున తెలియన్‌” అన్న పంక్తులనుబట్టి సాహిత్య చరిత్రకారులు కొలని గణపతి దేవుడు నాటకాలుసహా మరికొన్ని కృతులను కూడా రచించినట్లు భావించారు.

మంత్రిగా, దండనాథునిగా ప్రసిద్ధి

కొలని గణపతి దేవుడు మంత్రిగా, దండనాథునిగా ప్రశస్తి చెందాడు. ఆయన తన గురించి తాను ‘అనన్య నారీ సహోదరుడ’నని, ‘యోగిజన పదపంకేరుహమత్తమధుకరుడ’నని ‘అన్యస్తుతీ పరాజ్ముఖుడ’నని, ‘శివస్తుతి సుమఖుడ’నని ‘శివయోగ సార’ పీఠికలో చెప్పుకున్నాడు. ఎందరెందరో శివయోగులను గణపతి సేవించుకున్నాడు.

ఆయన బంధువు, విద్యాగురువు అయిన సదాశివ యోగికి ఈ గ్రంథం అంకితం ఇచ్చాడు. ఇందులో ఒక చిన్న విశేషం ఉంది. ఈ సదాశివ యోగి పూర్వాశ్రమంలో ఈడూరి నూకనారాధ్యుడు. ఈయన కొలని గణపతి దేవునికి మేనబావ. సన్యాసాశ్రమ స్వీకారానంతరం సదాశివ యోగిగా మారిన ఈ మహనీయునికి గ్రంథకర్త శిష్యుడై, తాను రచించిన ‘శివయోగ సారాన్ని’ గురువుకే అంకితం చేశాడు. గురువు అయిన సదాశివ యోగి సకల వేద పురాణ శాస్త్రార్థ స్వారస్య విజ్ఞాతగా, సర్వజ్ఞుడుగా కీర్తి పొందిన మహనీయుడు. 

ఎందరో యోగుల చరిత్రలు

‘శివయోగ సార’ పీఠికలోని కవి ‘సదాశివ యోగి ఘనమైన ఆధ్యాత్మిక శాస్త్రవేత్తయని, కాశి మొదలైన అనేక శైవ పుణ్య ప్రదేశాలలో చరించాడని ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. సదాశివ యోగి సంస్కృతంలో రచించిన ‘శివయోగ సార సముచ్చయం’ అనే గ్రంథానికే వారి శిష్యుడైన కొలని గణపతి దేవుని రచన ‘శివయోగ సారము’ తెలుగు అనువాదమని ఆచార్య ఎస్.వి.రామారావు వంటి సుప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు.

దీని రెండు భాగాల్లోని 12 ఆశ్వాసాలలో నాథ సంప్రదాయానికి చెందిన ఎందరో యోగుల చరిత్రలు ప్రత్యేకమైన రీతిలో వర్ణితమైనాయి. మత్స్యేంద్రుడు, జాలంధర నాథుడు, గోరక్షుడు మొదలైన యోగుల చరిత్రలే కాక ఈ కావ్యంలో ఎన్నెన్నో సుభాషితాలు, నీతిబోధలు, పంచయజ్ఞాలు, ముద్రలు, ఆసనాలు మొదలైన అనేక విశేషాంశాలు కూడా చోటు చేసుకున్నాయి.

‘స్వరశాస్త్ర మంజరి’ పేర ఒక ద్విపద కావ్యం తెలుగులో ఉంది. ఈ గ్రంథ సృష్టికర్త గణపనారాధ్యుడు. తొలుత సాహిత్య చరిత్రకారులు ఇదికూడా కొలని గణపతి దేవుని కృతిగానే భావించారు. కాని, లోతైన పరిశోధనానంతరం గణపనారాధ్యుడు ఆయనకు పూర్వీకుడై ఉంటాడని, ఒకటే గోత్రం వారు కనుక బహుశా ఈ కొలని గణపతి దేవునికి ముందు తరం వాడని పలు అంతస్సాక్ష్యాల ఆధారంగా నిర్ధారించారు.

ఇద్దరూ ఒకే రాజ్యంలోనే మంత్రులుగా కొలువు చేసిన వారి సంతతికి చెందిన వారు గనుక ఈ నిర్ధారణకు చరిత్రకారులు వచ్చారు. ‘స్వరశాస్త్ర మంజరి’ పేరునుబట్టి ఇదొక సంగీత సంబంధ రచనగా భ్రమించవచ్చు. కాని, ఇది యోగశాస్త్ర సంబంధిత విషయాలతో కూడిన రచన. దీనినిబట్టే, ఇది కొలని గణపతి దేవుని రచన కావచ్చునని మొదట్లో పలువురు సాహితీవేత్తలు అభిప్రాయపడ్డారు.  తదనంతరం ఈయన కొలని గణపతి దేవుడు కాడన్న నిర్ణయానికి వారు వచ్చారు.

వైరాగ్య రచనగా ‘మనో బోధ’

కొలని గణపతి దేవుడు రచించిన ‘మనో బోధ’ ద్విపద కావ్యం. ఇందులో కవి వైరాగ్యాన్ని అతి సులభమైన తేటతేట తెలుగు మాటలలో, చదువరికి ఆసక్తి కలిగించేలా చెప్పడం గొప్ప విశేషం.

“అలరుల తావికి నలరునే మిడుత?

మృదు శంఖనాదంబు మెచ్చునే చెవుడు?

కొమరారు నృత్తంబు కోరునే చీటి?

కస్తూరి వెరకునే గ్రామ సూకరము?

వెలయ సౌభాగ్యంబు వెదకునే గూబ?

తనదారి చతురత దనరునే యెద్దు?

పాపాత్మునకునేల భక్తుని క్రియలు?”

అంటూ వైరాగ్యంలోని వివిధ భావాల్ని చెప్పిన పంక్తుల్లో సామాన్యునికి అర్థమయ్యే పోలికలు ఉండడం కవి అంతరంగాన్ని తెలుపుతున్నది. అంతేకాదు, తరువాతి కృతియైన ‘శివయోగ సారము’లో కూడా దర్శనమిచ్చే భావాలకు భూమిక ఈ ‘మనో బోధ’లో కనిపిస్తుంది. తన మొదటి కృతియైన ఈ కావ్యం (మనోబోధ)లో

“మాయబంధులనేల మరిగెదవు మనస

చుట్టాలు పక్కాలు సుతులు సోదరులు

కలిమిలో సరి, వారు కలిమి కుందినను

సిరి వోయెనని తన్ను జేరంగ నీరు

ఏ మేడ? మీరేడ? యేమి పోరామి

అని పెక్కు భంగులందంద బలుక..”

అంటూ జీవిత సత్యాన్ని చెప్పాడు.

“ఎవ్వరెవ్వరి వారు ఏమి పోరామి?

చావు మాన్పగలేరు చా దోడురారు

తన చేయు పుణ్యంబు తన తోడు నీడ” 

అని నిశ్చయంగా పలికి పాఠకుల కళ్లు తెరిపించే ప్రయత్నం చేశాడు. ఇంచుమించు ఇవే భావాలతో కలిసే పద్యాన్ని కూడా ‘శివయోగ సారం’లోకూడా కొలని గణపతి దేవ కవి వ్యక్తపరిచాడు.

“ఏ వారైనను వారలేమవుదురూహింపంగ నెవ్వారికిన్

జావా మాన్పగలేరు, పిదపం జా దోడురానైన లే

రావేగంబున దోడ చచ్చినను గర్మాయత్తులై యున్న లో

కావాసంబున కేమగు చుండుదురు తథ్యం బంతయుం జూడగన్‌”

అంటూ స్పష్టపరిచిన విధానాన్ని గమనిస్తే ఈ విషయంలో కవికి వున్న నిశ్చితాభిప్రాయం అవగతమవుతుంది. లోకం పోకడను పరిశీలిస్తే వైరాగ్యాన్ని, వేదాంతాన్ని రంగరించి లోకం తీరును ఆవిష్కరించే ప్రయత్నాన్ని కవి రెండు కృతుల్లోను చెప్పాడు. దీన్నిబట్టి ఆయన కృత నిశ్చయం ఎంత బలమైందో అర్థమవుతున్నది.

ప్రజాకవి వేమనకు స్ఫూర్తినిచ్చిన భావాలు

తెలుగులో ప్రజాకవిగా ప్రఖ్యాతి గాంచిన వేమన పద్యాలన్నీ లోకంలోని పలు మూఢ విశ్వాసాలను, అసంబద్ధపు ఆచార వ్యవహారాలను ఎండగట్టినవే. అటువంటి గొప్పనైన ప్రజాకవి వేమనకే స్ఫూర్తినిచ్చిన మహాకవిగా సాహిత్య చరిత్రకారులు కొలని గణపతి దేవుని గుర్తించారు. ఇందుకు ఆయన రచనలలోని భావాలే ప్రత్యక్ష నిదర్శనాలు. 

వేమన చెప్పిన-

“కనగ సొమ్ములెన్నొ, కనకంబు నొక్కటే

పసుల వన్నెలెన్నొ, పాలునొకటె

పుష్పజాతులెన్నొ, పూజ యొక్కటే సుమీ

విశ్వదాభిరామ వినురవేమ” 

దాదాపు ఇదే తరహా భావనతో వేమనకన్నా పూర్వమే ఈ గణపతి దేవ కవి ‘మనో బోధ’లో అభిప్రాయ పడడం గమనార్హం 

“అవులు పలు చాయలై యుండుగాక

పాలు నా చాయలై బరుగునె చెపుమా?

జాతులు పెక్కని చాటిన నేమి..”

అన్నాడాయన. ఈ భావన వేమనకు స్ఫూర్తిని ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా వేమన చెప్పిన బోడులైన తలపులు బోడులా” అన్న భావం వంటి భావననే కొలని కవి కూడా వెల్లడించాడు.

“వెంట్రుకల్ చీరలు విడిచి పోయినను

మాయలు విడుచునే మనస! భావింప

తలబోడి చీరయు, తలపులో నెపుడు

తలవని పడచుల తత్తజ్ఞులండ్రు”

అన్న ఈ ద్విపదలోని భావస్ఫూర్తి వేమన కవీంద్రునిలో మరింత వికసించి, సామాన్య లోకానికి కనువిప్పు కలిగించే స్థాయిని అందుకున్నది.

ఈ విధంగా ఈ కవి తన రచనల్లో చెప్పిన అనేక భావసామ్యాలు వేమనలోనూ కనిపించడం వల్ల ప్రముఖ సాహితీవేత్త ఆరుద్ర “మనో బోధ గ్రంథంలోని వైరాగ్యాన్ని వేమన కూడా అలవరచుకున్నాడు. ఇందులోని పాదాలు మువ్వలు అతని ఆటవెలదుల పాదాల గజ్జెలైనాయి” అన్నారు. 

ఈ మాటలవల్ల గణపతి దేవుని ‘మనో బోధ’లో వ్యక్తమైన వైరాగ్య భావాలు వేమన పద్యాల్లో సంపూర్ణ సత్యాలై వెలిగాయని తెలుస్తున్నది. 

ఆ నాటకాలు లభ్యమై ఉంటే?

అందమైన మంజరీ ద్విపదల్లో పొందు పరచిన విశేషమైన వైరాగ్య భావాల రచయితగా కొలని గణపతి దేవుని చూడాలి. జనులందరూ “ఔను ఔను” అని కొనియాడిన ఆయన విరచిత నాటకాలు, ఇతర రచనలు లభింపక పోవడం తెలుగువారి దురదృష్టమే. ఆనాటి తెలుగు కవులు పలువురు తమ రచనల్లో నాటకీయతను పొందు పరచే ప్రయత్నం చేశారు గాని పూర్తి స్థాయిలో నాటక రచన చెయ్యలేదు. ఆయన రచించాడని చెబుతున్న నాటకాలు లభించి ఉంటే తెలుగు సాహిత్యం సుసంపన్నత సాహితీ లోకానికి మరింత గొప్పగా తెలిసి ఉండేది.

గన్నమరాజు గిరిజా మనోహరబాబు

9949013448