calender_icon.png 29 September, 2024 | 11:10 PM

కొరియర్ పేరిట సైబర్ మోసం

29-09-2024 02:28:27 AM

మహిళ ఖాతా నుంచి రూ.4 లక్షలు లూటీ 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఫెడెక్స్ కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఓ మహిళను భయబ్రాంతులకు గురి చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.4 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. నగరానికి చెందిన ఓ మహిళా ఉద్యోగి (38)కి +91 91091 98255 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.

తాము ఫెడెక్స్ కొరియర్ హెడ్ ఆఫీస్ (ముంబై) నుంచి మాట్లాడుతున్నామని పరిచయం చేసుకున్న వ్యక్తి.. మీ వివరాలతో కూడిన ఇరాన్‌కు పంపిస్తున్న పార్శిల్‌ను ముంబై ఎయిర్‌పోర్టులో స్వాధీ నం చేసుకున్నామని, అందులో 4 పాస్‌పోర్టులు, 3 క్రెడిట్ కార్డులు, 4 కిలోల వస్త్రాలు, 200 గ్రాముల మాదకద్రవ్యాలు, ఒక ల్యాప్‌టాప్ ఉన్నట్లు గుర్తించామని వివరించాడు.

ఈ క్రమంలో మీపై కేసు నమోదు అయ్యిందని విచారణకు సహకరించాలని, లేకపోతే వెంటనే అరెస్ట్ చేయాల్సి వస్తుందని భయబ్రాంతులకు గురిచేశాడు. స్కైప్ యాప్‌లో వీడియో కాల్ చేసి, విచారణ నిమి త్తం ముంబాయి సైబర్ సెల్ అధికారితో మాట్లాడాలని వారికి కాల్ కనెక్ట్ చేసినట్లు నటించాడు.

దీంతో లైన్‌లోకి వచ్చిన సదురు నకిలీ అధికారి బాధితురాలిని పలు రకాల ప్రశ్నలతో భయబ్రాంతులకు గురిచేసి, మీపై కేసు కొట్టివేయాలంటే తమకు పూర్తిగా సహకరించాలని నమ్మబలికాడు. విచారణ క్రమంలో బాధితురాలి బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును తాము సూచించిన బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి బదిలీ చేస్తామని చెప్పారు.

దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన బాధితురాలు తన ఖాతాలో ఉన్న రూ. 4 లక్షలను బదిలీ చేసింది. అనంతరం స్కామర్ల నుంచి ఎలాంటి స్పందన  లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు శని వారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.