28-03-2025 12:30:33 AM
బాధితుల పక్షాన నేడు తీన్మార్ మల్లన్న సభ
నాగర్‌కర్నూల్, మార్చి 27 (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ రైతులంతా తమకు వచ్చిన పరిహారం డబ్బులను అధిక వడ్డీ ఆశ చూపిన చిట్టీల వ్యాపారి సాయిబాబాకు ముట్ట చెప్పారు. రూ.లక్షకు రూ.20 వేల చొప్పున మిత్తి ఇస్తానని చెప్పడంతో దాదాపు మూడువేల మంది రూ.150 కోట్లకు పైగా ఇచ్చారు. అందులో 75 మంది ఇప్పటికే చనిపోయారు. మొదట మిత్తి సొమ్ము చెల్లిస్తూ అందరిని నమ్మించిన సాయిబాబా ఆ తర్వా త డబ్బులను ఇవ్వకుండా మొండికేయడంతో బాధితులు మోసపోయా మని గ్రహించారు.
పలు పోలీస్ స్టేషన్‌లలో బాధితులు సాయిబాబాపై కేసులు పెట్టించినా పోలీసులు కూడా చేతివాటాన్ని ప్రదర్శించి, నిందితుడికే సహకరించారనే విమర్శలు ఉన్నాయి. న్యాయం కోసం ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగలేదు. దీంతో బాధితులంతా చిట్టిల వ్యాపారి సాయిబాబా పేరుతోనే ఒక సంఘంగా ఏర్పడ్డారు. వారితో కలిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో బాధితుల పక్షాన పోరాడేందుకు సభను ఏర్పాటు చేస్తున్నట్లు తీన్మార్ మల్లన్న టీం ప్రకటించింది.