వచ్చే ఎన్నికల కల్లా బీఆర్‌ఎస్ ఖతం
- ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ పత్తాలేడు
- రాష్ట్రంలో ఉనికి కోసమే బీజేపీ నేతల ఆరాటం
- లక్ష మందితో 19న వరంగల్‌లో విజయోత్సవ సభ
- పీసీసీ అధ్యక్షడు మహేశ్‌కుమార్‌గౌడ్
జనగామ, నవంబర్ 16 (విజయక్రాంతి): నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ పదేళ్లలో లూటీ చేశారని, వచ్చే ఎన్నిక లకల్లా బీఆర్‌ఎస్ పార్టీ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. రేవంత్‌రెడ్డి ఏడాది పాలన సందర్భంగా ఈ నెల 19న వరంగల్‌లో నిర్వహించనున్న విజయోత్సవ సభకు సంబంధించి శనివారం హనుమకొండలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందిరా గాంధీ జయంతి, కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా ఇం దిరా మహిళా శక్తి పేరుతో వరంగల్‌లో లక్ష మంది మహిళలతో ఈ నెల 19న సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది, రేవంత్‌రెడ్డి పది నెలల్లో చేసి చూపెట్టారని స్పష్టంచేశారు.
పదేళ్లలో వారు రైతులకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా 9 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని ఉద్ఘాటించారు. కేసీఆర్ పదేళ్లలో 48 వేల ఉద్యోగాలిస్తే.. తాము ఏడాది లోపే 50 వేల ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా నడుస్తుంటే ఓర్వలేక బీఆర్‌ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యారంగానికి రేవంత్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, అందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి నడుం బిగించారని తెలిపారు. ప్రతీ పేదవాడికి న్యాయం చేయాలనే సంకల్పంతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని చెప్పారు. కొడంగల్‌లో ఫార్మా విలేజీ ఏర్పాటు చేయాలని తలపెట్టడం ఇందులో భాగమేనని చెప్పారు. వరంగల్‌కు గిరిజన వర్సిటీ మంజూరు చేశామని, త్వరలోనే విమానాశ్రయం రాబోతుందని వివరించారు.
అభివృద్ధి అడ్డుకునేందుకే ఆటంకాలు
ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృస్టించినా తాము చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరని మహేశ్‌గౌడ్ స్పష్టంచేశారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి బృహత్తర కార్యక్రమాలపై బీజేపీ, బీఆర్‌ఎస్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రాతో అక్రమ భూబకాసురులకే తప్ప పేదలకు ఎలాంటి నష్టం లేదని పునరుద్ఘాటించారు.
ధరణిలో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, అందులో తన భూములు కూడా పోయాయని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ పది నెలల అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మం త్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష హోదా ఇస్తే పత్తా లేడు
రాష్ట్ర ప్రజలు 39 సీట్లతో బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరఫున పోరా టం చేయాల్సిన కేసీఆర్ పత్తా లేకుండా పోయాడని మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవాచేశా రు. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సోషల్ మీడి యాను బీఆర్‌ఎస్ ఇష్టారీతిన వాడుతూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిం చారు.
తప్పు చేసినారు కాబట్టే పదేపదే జైలు కు వెళ్తానని కేటీఆర్ చెప్తున్నారని, చట్టప్రకారం ఆయనకు శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో ఉనికి కోసమే బీజేపీ ఆరాటపడుతోందని అన్నారు.
మూసీ ప్రక్షాళనకు సీఎం పూనుకుంటే సహకరించాల్సింది పోయి లేనిపోని రాద్దాంతం చేయడం తగదని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మూసీ నిద్ర చేస్తాననడం విడ్డూరంగా ఉంద ని.. దాంతో ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు.