ప్రస్తుతం విశాఖ, తిరుపతి, యశ్వంత్‌పూర్, నాగ్‌పూర్‌లకు 4 రైళ్లు
- చెన్నై, ముంబై, పుణె, గోవాకు వందేభారత్‌కు ఫుల్ డిమాండ్
- త్వరగా అందుబాటులోకి తీసుకురావాలంటున్న ప్రయాణికులు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి 4 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటి వల్ల సమయం ఆదా కావడంతో వీటికి ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది. అనేక మంది ప్రయాణికులు వందేభారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఎక్కువగా పగటిపూటే ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. వేగంగా గమ్యం చేరుకునేందుకు రైల్వే ప్రయాణికులకు వందేభారత్ చక్కని మార్గంగా మారుతున్నాయి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లేందుకు సాధారణ ఎక్స్‌ప్రెస్ లేదా సూపర్ ఫాస్ట్ రైళ్లలో 12 నుంచి 13 గంటల వరకు పడుతుంది. కానీ వందేభారత్ వచ్చాక విశాఖను కేవలం 9 గంటల్లో చేరుకోవడం సాధ్యమైంది. ఇక కాచిగూడ నుంచి యశ్వంతాపూర్ (బెంగళూరు) వెళ్లేందుకు కూడా సాధారణ రైళ్లకు 13 నుంచి 15 గంటల వరకు పడితే వందేభారత్‌కు మాత్రం కేవలం 8 గంటలే. తిరుపతి, నాగ్‌పూర్‌కుసైతం ఇదే విధంగా సమయం బాగా కలిసివస్తోంది. దీంతో హైదరాబాద్ నుంచి 1000 కి.మీ లోపు ఉన్న నగరాలకు కూడా వందేభారత్ రైళ్లు నడిపించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
గోవాకు ఫుల్ డిమాండ్..
గోవా అంటే పర్యాటకులకు ఎక్కడా లేని జోష్. అక్కడ బీచ్‌లు, రిసార్టులు, వీకెండ్ పార్టీలు, క్రూయిజ్ ట్రిప్స్, వివిధ రకాల ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం గోవా వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేందుకు రైలు మార్గం కర్నూలు, గుంతకల్, హుబ్లీ మీదుగా 820 కి.మీ అవుతుంది. ప్రస్తుతం మంగళవారం, గురువారం రెండు రైళ్లు నడుస్తున్నాయి. ఇక ఎప్పటి నుంచో యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైలుకు రెండు బోగీలు తగిలించి గోవాకు పంపిస్తున్నారు. ఇందులో కేవలం 72 మంది రిజర్వేషన్ ప్రయాణికులు మాత్రమే ప్రయాణించేందుకు వీలుంది.
అంటే వారానికి 7 రోజులు నడిచేలా హైదరాబాద్ నుంచి గోవాకు పూర్తిస్థాయిలో కనీసం ఒక్కటంటే ఒక్క రైలు లేదు. ఈ మూడు రైళ్లకు కూడా దాదాపుగా 19 గంటల సమయం పడుతోంది. రాత్రి 9 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరే గోవా రైలు మరుసటి రోజు సాయంత్రం 3.45 గంటలకు గోవా చేరుకుంటుంది. ఇంత సమయం పడుతున్నా కూడా అనేకమంది రైళ్లలో ప్రయాణానికి మొగ్గుచూపుతున్నారు. రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అలాగే విమానాలను ఆశ్రయించే వారు చాలా మందే ఉన్నారు. అందుకే 820 కి.మీ ప్రయాణాన్ని దాదాపు 10 గంటల లోపు కవర్ చేసేలా వందేభారత్ ఏర్పాటు చేయాలని గోవా వెళ్లే ప్రయాణికులు కోరుతున్నారు.
పుణె, ముంబయి రైలు ఎక్కడ?
దేశంలో ప్రవేశపెట్టబోయే తొలి వందేభారత్ స్లీపర్‌ను సికింద్రాబాద్ పుణె మార్గంలో ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు లీక్ ఇచ్చి నెలలు గడుస్తోంది. స్లీపర్ సంగతి దేవుడెరుగు కనీసం రెగ్యులర్ వందేభారత్ అయినా ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలంగాణకు చెందిన అనేకమంది పుణె, ముంబయిలో ఉద్యోగాలు చేస్తుంటారు. వీరితో పాటు వ్యాపారాల కోసం షోలాపూర్, పుణె, ముంబయి వెళ్లే వారెందరో ఉంటారు. అందుకే వందేభారత్ తప్పకుండా ప్రవేశపెట్టాల్సిన మార్గాల్లో సికింద్రాబాద్ పుణె, ముంబయి ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబయికి 10, పుణెకు 12 రైళ్లు నడుస్తున్నాయి. ముంబయికి 790 కి.మీ దూరాన్ని 14 నుంచి 16 గంటల్లో చేరుకునేందుకు అవకాశం ఉంది. దూరంతో రైలు మాత్రం 12 గంటల్లో చేరుకుంటోంది. ఇక పుణెకు 640 కి.మీ దూరానికి శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌కు 8 గంటలు పడుతోంది. వందేభారత్ రైలును ప్రవేశపెడితే పుణెకు కేవలం 7నుంచి 8 గంటల్లో, ముంబయికి 10 గంటల లోపు చేరుకోవచ్చు.
అన్ని నగరాలను కవర్ చేసేలా..
రైల్వే శాఖ వందేభారత్ రైళ్లను కొత్త మార్గాల్లో ప్రవేశపెడుతున్న తరుణంలో సికింద్రాబాద్ నుంచి కీలకమైన గోవా, చెన్నై, పుణె, ముంబయికి కూడా ప్రారంభిస్తే ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు కలుగనుంది. హైదరాబాద్ నుంచి 1000 కి.మీ లోపున్న అన్ని ప్రధాన నగరాలకు వందేభారత్ ప్రవేశపెట్టినట్లు అవుతుంది. రైల్వే శాఖ అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
చెన్నైకు వందేభారత్ కావాలి..
హైదరాబాద్ నుంచి అనేకమంది నిత్యం చెన్నై వెళ్లే ప్రయాణికులుంటారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని నుంచి చెన్నైకి కేవలం 5 రైళ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్లే రైలు. ఇది 790 కి.మీ ప్రయాణాన్ని 13 గంటల్లో పూర్తి చేస్తుంది. మిగతా రైళ్లు కూడా 14 నుంచి 16 గంటల్లో హైదరాబాద్ నుంచి చెన్నై చేరుకుంటాయి. అయితే వందేభారత్ ఏర్పాటు చేస్తే 10 గంటల లోపు చెన్నై చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రైలును రేణిగుంట మీదుగా నడిపితే తిరుపతికి అదనంగా మరో వందేభారత్ అవకాశం కల్పించినట్లుగా కూడా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. దక్షిణాదిన రెండు ప్రధాన నగరాలను కలిపేలా వందేభారత్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెన్నైకు ప్రయాణించే శ్రీనివాస్ అనే ప్రయాణికుడు విజయక్రాంతికి తెలిపారు.