తొలి ముఖ్యమంత్రిగా పాలన బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ప్రభుత్వ యూనివర్సిటీలపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ స్థాయిలో అత్యాధునికంగా అభివృధ్ధి పరుస్తామన్న హామీని సైతం పూర్తిగా విస్మరించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఒక్కసారికూడా ఉన్నత విద్యపై ఆయన సమీక్ష జరపకపోవడం గమనార్హం. పాలకుల నిర్లక్ష్యం వల్ల క్రమంగా యూనివర్సిటీల జాతీయ స్థాయి ర్యాంక్ మరింత దిగజారింది. స్వరాష్ట్రంలో తొలిసారిగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీలపై ప్రత్యేక దృష్టి సారించడం అత్యవసరం.
స్వరాష్ట్రంలో గత ఉమ్మడి ప్రభుత్వాలు ఇచ్చిన నిధులకంటే అత్యంత తక్కువగా 2014 ఆర్థిక సంవత్సరంలో 10.57 శాతం, 2023 ఆర్థిక సంవత్సరంలో కేవలం 6.67 శాతం మాత్రమే నిధులు కేటాయించి గత పాలకులు నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచారు. వర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకాల్లో జాప్యం, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీల నిర్వీర్యానికి పూనుకున్నారు.
తమ పార్టీకి చెందిన బడా నేతలకు కొత్తగా ఐదు ప్రైవేటు యూనివర్సిటీల (అనురాగ్, మల్లారెడ్డి, మహీంద్రా, ఎస్.ఆర్, ఓక్సెస్) స్థాపనకు అనుమతించడమే ఇందుకు ఒక మంచి ఉదాహరణగా పేర్కొనాలి. సదరు ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు కూడా అమలు పరుచడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ యూనివర్సిటీల్లోకి అడుగు పెడుతున్న తొలి తరానికి చెందిన పేద, బలహీన వర్గాల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. నాసిరకం ఆహారంతోపాటు రక్షణ కొరవడింది. పీజీ, పీహెచ్‌డీ కోర్సుల ఫీజులు అమాంతం పెంచి విద్యార్థులపై ఆర్థిక భారం మోపారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్ షిప్‌ల మంజూరులోనూ అలసత్వం చూపారు.
దిగజారిన ఓయూ ర్యాంక్
నిధుల కొరత కారణంగా సరైన మౌలిక సదుపాయాలు కల్పించక పోవడం, ప్రొఫెసర్ల నియామకాలు చేపట్టక పోవడంతో ప్రభుత్వ యూనివర్సి టీల్లో నాణ్యమైన విద్య అందడం లేదు. ఫలితంగా గత 2023లో ఎన్‌ఐఆర్‌ఎఫ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో ఉస్మానియా యూనివర్సిటీ 64వ స్థానానికి పడిపోయింది. నాక్ జాతీయ సంస్థ ఇచ్చే ‘ఎ’ ప్లస్ ర్యాంకింగ్‌లోనూ కింది స్థానానికి దిగజారితే యూనివర్సిటీ నుండి పొందే సర్టిఫికెట్‌కు ప్రాధాన్యం తగ్గుతుంది. ఈ పరిణామం ఇక్కడ విద్యను అభ్యసించే పేద, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలపై ప్రభావం చూపుతుంది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో వర్సిటీలకు అధిక శాతం నిధులు కేటాయించాలి. యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) నిబంధనలకు లోబడి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. అకాడమిక్ అనుభవం కలిగిన వారిని పూర్తి కాలపు వైస్ ఛాన్సలర్లుగా నియమించి, ఆరు నెలలకోసారి సమీక్ష జరపాలి. ప్రభుత్వ యూనివర్సిటీల ప్రతిష్ఠను పెంచి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
నరేష్ పాపట్ల
సెల్ : 9505475431