calender_icon.png 15 October, 2024 | 9:54 PM

లుక్ ఈస్ట్.. ఇన్వెస్ట్

18-08-2024 02:00:00 AM

అందుబాటులో ప్లాట్లు, ఇండ్లు, ఫ్లాట్ల ధరలు

  1. మెరుగుపడుతున్న ప్రజా రవాణా వ్యవస్థ 
  2. ఆసక్తి చూపుతున్న అన్ని వర్గాల ప్రజలు

బూడిద సుధాకర్ :

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 17 (విజయక్రాంతి): హైదరాబాద్ దేశంలోనే పెద్ద నగరంగా విస్తరిస్తోంది. హైదరాబాద్ నలుదిక్కులూ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. నగరంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో నగర శివారు ప్రాంతమంతా పట్టణీకరణ సంతరించుకుంటోంది. ఇప్పటికే హైదరాబాద్ నార్త్, సౌత్, వెస్ట్ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ అడ్డాగా మారగా, తాజాగా ఈస్ట్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుంటోంది. గతంలో ఉప్పల్ వరకు మాత్రమే విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ ప్రస్తుతం బీబీనగర్  మీదుగా యాదాద్రి వరకు విస్తరించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రాష్ట్ర రాజధానికి స్వాగత తోరణంగా ఈస్ట్ హైదరాబాద్ విస్తరించి ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనా ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంస్కరణల ఫలితంగా ఉప్పల్ మీదుగా బీబీనగర్ వరకు విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం దశ, దిశ మారుతోంది. ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన విధానాల అమలుకు శ్రీకారం చుడుతుండటంతో పల్లెలు కూడా పట్టణాలుగా దర్శనమిస్తున్నాయి.

ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా ఉన్న పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా నేడు ఆకాశాన్ని తాకేలా బహుళ అంతస్తుల భవంతులు, కోట్లు విలువ చేసే విల్లాలు, వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే పరిశ్రమలు, ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక క్షేత్రాలు ఆకుపచ్చని అందాలతో ఆహ్లాదాన్ని పంచే ఆక్సిజన్ పార్కులు ఈస్ట్ హైదరాబాద్‌కు ఇరువైపుల దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఔటర్ వరకు నగరాన్ని విస్తరించాలనే ప్రతిపాధనలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

వరంగల్ జాతీయ రహదారికి ఇరువైపులా రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానంగా సువిశాలమైన ఓఆర్‌ఆర్‌తోపాటు ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌ను కలుపుతూ ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ఘట్‌కేసర్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైల్ మార్గాన్ని ప్రారంభించడంతో ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో స్థిరాస్తి పెట్టుబడులకు ఈస్ట్ ఈస్ ది బెస్ట్ అనే అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాలతోపాటు స్థిరాస్తి కొనుగోలుదారుల నుంచి వ్యక్తమవుతోంది.

ఈస్ట్‌లో పెరిగిన డిమాండ్

హైదరాబాద్, సైబరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ సంస్థలను రాష్ట్ర నలుదిక్కులా విస్తరించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం జిల్లా కేంద్రాలోన్లూ ఐటీ టవర్లను నిర్మించింది. ప్రతిష్ఠాత్మక రోడ్డు రవాణా, ప్రజారవాణా వ్యవస్థ మార్గాలు విస్తరించి ఉన్న ఈస్ట్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, ఉప్పల్ ఐటీ సెజ్, జెన్ ప్యాక్ట్ వంటి ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీలు తమ తమ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

తాజాగా మూసీ వెంట మెట్రో విస్తరణ, వేల కోట్లతో మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం అవుతుండటంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంగా ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ రోడ్డుకు అవసరమైన భూసేకరణలో వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ జిల్లాల నుంచి నిమిషాల వ్యవధిలోనే ఈస్ట్ హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతంలో వెలసిన వెంచర్లలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు, ఫాంహౌస్‌లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని రియల్టర్లు పేర్కొంటున్నారు.

పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ధరలు

ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ, సైబరాబాద్ కేంద్రంగా అభివృద్ధి జరిగింది. తద్వారా ఆ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు విస్తరించడంతో మెజార్టీ ఐటీ ఉద్యోగులు ఆ ప్రాంతాల్లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజల డిమాండ్ దృష్ట్యా ఆ ప్రాంతాల్లో భూముల ధరలతోపాటు ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగాయి. దీంతో ఐటీ పరిశ్రమలపై ఆధారపడి జీవించే అనేకమంది పేద, మధ్య తరగతి ప్రజలకు స్థిర నివాసం నేటికీ అందని ద్రాక్షే అయ్యింది. కానీ ప్రస్తుతం తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతోంది. దీంతో సౌత్, వెస్ట్‌లకు దీటుగా ఈస్ట్ హైదరాబాద్ అభివృద్ధి చెందుతోంది.

అలాగే పెద్ద పెద్ద విద్యాసంస్థలు ఈ ప్రాంతంలో బ్రాంచ్‌లను నెలకొల్పుతున్నాయి. బీబీనగర్ ఎయిమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక ధవాఖానలతోపాటు ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు వందల సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, వేల సంఖ్యలో కార్పొరేట్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు విస్తరిస్తున్నాయి. ఈ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల పిల్లలు చదువుతున్న విద్యాసంస్థలకు దగ్గరగా నివాసం ఉండేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

అలాగే హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలతో పోల్చితే ఈస్ట్ హైదరాబాద్‌లో తక్కువ ధరకే ప్లాట్లు, ఇండ్లు లభిస్తుండటంతో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు కూడా అందుబాటులో భూముల ధరలున్న నేపథ్యంలో ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో నివాస స్థలాలను కొనుగోలు చేసేందుకు మెజార్టీ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని రియల్టర్లు పేర్కొంటున్నారు. హైదరాబాద్ వెస్ట్, నార్త్, సౌత్‌లో ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టయితే మెట్రోతోపాటు ఔటర్, ఎంఎంటీఎస్, రీజినల్ రింగ్ రోడ్డు, వరంగల్ జాతీయ రహదారి మార్గాల ద్వారా నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే వెసులుబాటు కలుగుతుంది.

మెరుగవనున్న రవాణా వ్యవస్థ

వరంగల్ జాతీయ రహదారిపై వాహన రద్దీని తగ్గించాలనే లక్ష్యంతో ఎంఎంటీఎస్ ఫేజ్--2లో భాగంగా సికింద్రాబాద్, లాలాపేట్, చర్లపల్లి, ఘట్కేసర్ మీదుగా యాదాద్రి -రాయగిరి వరకు ప్రత్యేకంగా ఎంఎంటీఎస్ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఈ పనులు ప్రారంభించి సుమారు ఎనిమిదేండ్లు కావస్తున్నా నేటికీ కేంద్రం ఈ మార్గాన్ని పూర్తిచేయలేదు. అలాగే ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు కూడా ఒక్క అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి. కానీ ప్రతిపాదిత ప్రాజెక్టులు పూర్తయితే.. ప్రజలకు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడటంతోపాటు ఈస్ట్ హైదరాబాద్ రూపంలో యాదాద్రి వరకు మరో అత్యాధునిక నగరం తెలంగాణ రాష్ట్రంలో ఆవిష్కృతమవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

క్రమంగా పెరుగుతున్న ఇండ్ల ధరలు

  1. రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల్లో ఇల్లు
  2. చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి రూ.7,500

ఈస్ట్ హైదరాబాద్‌లో రియల్  ప్రాజెక్టులు విస్తరిస్తున్నాయి. సౌత్, వెస్ట్, నార్త్ హైదరాబాద్ ప్రాంతాలతో పోల్చితే ఉప్పల్ నుంచి భువనగిరి వరకు ఇండ్ల ధరలు కూడా అందుబాటులో ఉండటంతో ఈ ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరందుకుంది. గతంలో ఐటీ సంస్థల్లో పని చేసే వారంతా ఇప్పటివరకు వెస్ట్ హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడేవారు. ఐటీ కార్యాలయాలకు దగ్గరగా ఉండటంతోపాటు మౌలిక వసతులతో అభివృద్ధి చెందటంతో హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంలో ఇల్లు కొనేందుకు అంతా మొగ్గు చూపేవారు.

కానీ ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ఆలోచనలో క్రమంగా మార్పు వస్తోంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు, హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చాక ఐటీ కారిడార్‌కు దూరం తగ్గిపోయింది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులు సైతం ఉప్పల్ నుంచి 15 కిలోమీటర్ల వరకు స్థిర నివాసానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉప్పల్, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, ఘట్‌కేసర్, భువనగిరి వరకు కొత్తగా ఇండ్ల నిర్మాణాలు విస్తరించాయి.

గతంలో ఉప్పల్ ప్రాంతంలో రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలలోపు వచ్చే ఇళ్లు ఇప్పుడు రూ.60 లక్షల నుంచి మొదలు రూ.80 లక్షల వరకు పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు రూ.4 వేల నుంచి మొదలు రూ.7,500 వరకు పలుకుతోంది. అయినప్పటికీ ఇతర ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ధరలు అందుబాటులో ఉండటంతో వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు విస్తరిస్తున్నాయి. భవిష్యత్తులో మరింత అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కావడంతో ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాణదారులు భావిస్తున్నారు.