calender_icon.png 16 November, 2024 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికావైపు మార్కెట్ చూపు

04-11-2024 12:00:00 AM

  1. యూఎస్ అధ్యక్ష ఎన్నికలు, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం కీలకం
  2. ఈ వారం సూచీల కదలికలపై విశ్లేషకుల అంచనాలు

న్యూఢిల్లీ, నవంబర్ 3:  అమెరికాలో జరగబోయే కీలక పరిణామాల ఆధారంగా  ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఉంటుందని విశ్లేషకులు చెపుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల దృష్టి ప్రధానంగా నవంబర్ 5నాటి యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై నిలిచి ఉన్నదని, రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని విశ్లేషకులు వివరించారు.

ఈ ఎన్నికలతో పాటు నవంబర్ 6,7 తేదీల్లో జరిగే యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఫండ్స్ కమిటీ సమీక్షా సమావేశంలో వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం, భవిష్యత్ వడ్డీ రేట్లపై అందించే సంకేతాలు మార్కెట్లను గణనీయంగా ప్రభావితం చేస్తాయన్నారు. 

ఈ నేపథ్యంలో మార్కెట్ ఒడిదుడుకులు ఈ వారం కూడా కొనసాగుతాయని వారు అంచనా వేస్తున్నారు. ఈ వారం పూర్తిగా ఇన్వెస్టర్ల దృష్టి పూర్తిగా యూఎస్‌లో జరిగే పరిణామాలపై నిలిచి ఉన్నదని, అధ్యక్ష ఎన్నికలు, ఫెడ్ పాలసీ మీటింగ్ కోసం ఆతృతగా వేచిచూస్తున్నారని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ 

వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. ఇదే అభిప్రాయాన్ని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా వ్యక్తం చేస్తూ మరోవైపు అంతర్జాతీయ క్రూడ్ ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారని చెప్పారు. నవంబర్ 1న జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌తో సహా గతవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 79,724 పాయింట్ల వద్ద నిలిచింది. 

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 123 పాయింట్లు పెరిగి 24,304 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికలపై గ్లోబల్ మార్కెట్ల స్పందన కొన్ని రోజులపాటు ఉంటుందని, తదుపరి యూఎస్ జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ఫెడ్ రేట్లు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. 

కార్పొరేట్ల క్యూ 2 ఫలితాలు

ఈ వారం వెలువడే దేశీ కార్పొరేట్ల తుది దశ క్యూ2 ఫలితాలు స్టాక్స్‌వారీగా కదలికలకు కారణమవుతాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఈ వారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లాబ్, టైటాన్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ తదితర పెద్ద కంపెనీల ద్వితీయ త్రైమాసిక ఫలితాలు వెల్లడికానున్నాయి. అలాగే ఏషియన్ పెయింట్స్, పీబీ ఫిన్‌టెక్, ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ, ఆర్‌వీఎన్‌ఎల్, ట్రెంట్, ఎల్‌ఐసీ, ఎంఆర్‌ఎఫ్, బాటా ఇండియా ప్రకటించే ఫలితాలు కూడా కీలకమైనవని వివరించారు.  

ఎఫ్‌పీఐల 94 వేల కోట్ల రికార్డు విక్రయాలు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అక్టోబర్ నెల మొత్తంలో రికార్డుస్థాయిలో రూ. 94,000 కోట్ల పెట్టుబడుల్ని (11.2 బిలియన్ డాలర్లు) దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్నారు.  ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో ఎఫ్‌పీఐలు నికర విక్రయాలు జరపడం ఇదే ప్రధమం. ఈ ప్రభావంతో స్టాక్ సూచీలు వాటి గరిష్ఠస్థాయి నుంచి 8 శాతం పతనమయ్యాయి.

కోవిడ్ పాండమిక్ సందర్భంగా 2020 మార్చిలో ఉపసంహరించుకున్న రూ. 61,973 కోట్లను మించి ఈ అక్టోబర్ నెలలో ఈక్విటీలను విక్రయించారు. భారత్ మార్కెట్ వి లువ అధికంగా ఉం డటంతో ఇక్కడి నుంచి నిధుల్ని ఎఫ్‌పీఐలు  చౌక విలువలతో లభిస్తున్న చైనా స్టాక్స్‌లోకి తరలించినట్లు విశ్లేషకులు తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రూ.34,252 కోట్ల నిధుల్ని విత్‌డ్రా చేసుకున్న విదేశీ ఫండ్స్ జూన్ నుంచి సెప్టెంబర్ వరుసగా నికర కొనుగోళ్లు జరిపారు. ఈ ఏడాది  సెప్టెంబర్ నెలలో అత్యధికంగా రూ.57,724 కోట్లు భారత మార్కెట్లో పెట్టుబడి చేశారు. అయితే అక్టోబర్‌లో జరిపిన భారీ విక్రయాలతో 2024 సంవత్సరంలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ. 6,600 కోట్లకు పరిమితమయ్యాయి.

ఇటీవల యూ ఎస్ ట్రెజరీ ఈల్డ్ పెరగడం కూడా భారత్ మార్కెట్ నుంచి చౌకగా ఉన్న మార్కెట్లలోకి ఎఫ్‌పీఐలు నిధులు తరలించడానికి మరో కారణమని వినోద్ నాయర్ చెప్పారు. చైనా మార్కెట్లలో అర్బిట్రేజ్ అవకాశాల్ని వారు అందిపుచ్చుకుంటున్నారని, సెప్టెంబర్ మధ్య నుంచి ఎఫ్‌ఫీఐలు చైనా షేర్లను భారీగా కొనుగోలు చేస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.

రానున్న రోజుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు తగ్గడం, యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ట్రెండ్ రివర్సల్ ఆధారపడి ఉంటుందని నాయర్ వివరించారు.

దేశీయంగా ద్రవ్యోల్బణం బాటను, కార్పొరేట్ ఫలితాల్ని, పండుగ డిమాండ్ ప్రభావాన్ని గమనించిన తర్వాత భారత మార్కెట్లో పెట్టుబడి అవకాశాల్ని విదేశీ ఇన్వెస్టర్లు విశ్లేషించుకుంటా రని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు.