calender_icon.png 11 January, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్తింపు కోసం తాపత్రయం!

05-08-2024 12:25:58 AM

ట్రేడ్ యూనియన్ ఎన్నికల కోసం ఆర్టీసీ కార్మికుల డిమాండ్

ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించని ఆర్టీసీ యాజమాన్యం

గుర్తింపు సంఘం స్థానంలో వెల్ఫేర్ కమిటీలతో కాలయాపన

తీవ్ర ఆందోళనలో ఆర్టీసీ కార్మికులు, యూనియన్లు

హైదరాబాద్, ఆగస్టు 4(విజయక్రాంతి) : తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఉద్యోగులతో సమానంగా వారికి అన్ని సదుపాయాలను కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తమ మ్యానిఫెస్టోలో చేర్చింది. ప్రచారం సందర్భంగా నిర్వహించిన అనేక సమావేశాల్లో ఈ హామీలను నాయకులు వల్లెవేశారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల మాదిరిగానే ఆర్టీసీ కార్మికులు సైతం తమకు మంచి రోజులు వస్తాయని కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో విజయవంతంగా అమలవుతున్న ఏకైక హామీ మహాలక్ష్మి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సవ్యంగా సాగేందుకు ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడు తున్నారు.

డబుల్ డ్యూటీలుచేస్తున్నారు. కానీ, ఆర్టీసీ కార్మికులు తమ గుర్తింపు సంఘం ఎన్నికల కోసం గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా ఫలితం కనిపించ డంలేదని వాపోతున్నారు. ఈ నెల 2న ఆర్టీసీకి చెందిన ఆరు కార్మిక సంఘాలు కార్మిక శాఖ కమిషనర్‌ను కలిసి ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని, ఆ మేరకు యాజమాన్యంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో  కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆర్టీ సీ కార్మికులకు పొందుపర్చిన 5 హమీలు.. 

1. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసి, రెండు పీఆర్సీల బకాయిలు వెంటనే చెల్లిస్తాం.

2. వచ్చే పీఆర్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం.

౩. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సదుపాయాలను కల్పిస్తాం.

4. ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం

5. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు  అనుమతి ఇస్తాం. 

ఒక్క హామీ నెరవేరలే..

ఆర్టీసీలో చివరిసారిగా 2016లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగా యి. అప్పుడు తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచింది. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత 2018 నుంచి ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. 2018లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించవద్దంటూ అప్ప టి సర్కారు మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్  యాక్ట్ ప్రకారం తప్పనిసరిగా గుర్తింపు సం ఘం ఎన్నికలు నిర్వహించాలి.

కానీ, ఈ సర్కారు కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోందని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు బదులుగా ప్రతి డిపోకు ఓ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేస్తూ యాజమాన్యం కాలయాపన చేస్తోందని చెప్తున్నారు. కమిటీలతో తమకు ప్రయోజనం లేదని, కార్మికులను బానిసలుగా మార్చేసి వేదిస్తూ విధులు నిర్వహించేలా బాధలు పెడుతున్నారని వాపోతున్నారు. ట్రేడ్ యూనియన్ల స్థానంలో వెల్ఫేర్ కమిటీలు చట్ట విరుద్ధం అని చెప్తున్నారు.

వెల్ఫేర్ కమిటీల పేరిట కుట్రలు 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. యాజమాన్యం వేధింపులను తాళలేక అనేక మంది కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గుర్తింపు పొందిన యూనియన్ ఉంటే కనీసం మా హక్కుల కోసం పోరాడేందుకు అవకాశం ఉండేది. వెల్ఫేర్ కమిటీల పేరిట యాజమాన్యం, రవాణాశాఖ మంత్రి చేస్తున్న కుట్రలా ఉన్నది. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన వారికి లేదనిపిస్తోంది. మా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జేఏసీ సమావేశమై, భవిష్యత్తు ప్రణాళిక రచిస్తాం. 

థామస్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎంయూ

ఎన్నికలు వద్దంటే స్పష్టమైన ప్రకటన చేయాలి 

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరగకుండా యాజమాన్యంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి అడ్డుపడుతున్నాడు. ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు ఆర్టీసీ రూ.2,500 కోట్ల అప్పులో ఉంటే, ట్రేడ్ యూనియన్ లేకుండా ఎండీ పాలనలో రూ.10 వేల కోట్ల అప్పులకు చేరుకుంది. అంటే ట్రేడ్ యూనియన్లను పక్కనబెట్టి ఆర్టీసీ సాధించింది అదనంగా రూ.౭.౫ వేల కోట్ల అప్పే.  గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించవద్దనుకుంటే యాజమాన్యం స్పష్టమైన ప్రకటన చేయాలి.

వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్