calender_icon.png 28 April, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీర్ఘాయుస్మాన్ భవ!

20-04-2025 12:00:00 AM

వైద్యశాస్త్రం.. ఆయుర్దాయాన్ని రెండుగా విభజిస్తోంది. ఒకటి.. జీవితకాలం. ఇది పుట్టినప్పటి నుంచి మరణించే దాకా గడిచిన సమయం. రెండు ఆరోగ్యవంతమైన జీవితకాలం. ఇది ఏ రుగ్మతలూ లేకుండా హాయిగా జీవించిన సమయం. ఒకప్పుడు షష్ఠిపూర్తి వరకూ బతికితేనే గొప్ప. నేడు సునాయసంగా డ్బుభై ఎనభై ఏళ్లు జీవిస్తున్నారు.

కాకపోతే.. చాలామందిలో జీవితకాలాన్ని పొడిగించుకోవాలనే ఆరాటమే తప్పించి, ఆ అదనపు కాలాన్ని ఎంత నాణ్యంగా గడపాలనే ఆలోచన ఉండదు. గోడమీద బల్లిలా బిక్కుబిక్కుమంటూ బతికేస్తుంటారు. ఓ తాజా అధ్యయనం ప్రకారం.. జీవితకాలానికి, ఆరోగ్యకరమైన జీవితకాలానికి మధ్య సగటు పదేళ్ల అంతరం ఉంటుంది.

అంటే తుది శ్వాస వదిలే లోపు కనీసం పదేళ్లపాటు వ్యాధులతో సహవాసం చేయాల్సిందే. మంచానికో, చక్రాల కుర్చీకో పరిమితం కావాల్సిందే. థెరపీలూ, డయాలసిస్‌లూ అంటూ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. ఇలాంటి గాల్లో దీపం ఆయుర్దాయం మనకొద్దు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలి. పరాధీనత లేకుండా బతకాలి.

ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా ఆస్వాదించాలి. ఆ దిశగానూ పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయువును ప్రభావితం చేసే అంశాలపైన శాస్త్రవేత్తలు దృష్టిసారిస్తున్నారు. మనం అంటే.. మన జీవనశైలి. ఇటీవల అమెరికాలో ఏడు లక్షలమంది మాజీ సైనికుల అలవాట్లూ, ఆరోగ్య పరిస్థితుల మీద విస్త్రృతమైన అధ్యయనాలు జరిగాయి.

ధూమపానానికి దూరంగా ఉండటం, మాదకద్రవ్యాల జోలికి వెళ్లకపోవడం, మద్యాన్ని నియంత్రణలో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించుకోవడం, కంటినిండా నిద్రపోవడం, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవడం, ఒత్తిడిలేని జీవితాన్ని గడపడం, కుర్చీలో సోఫాలో పరిమితం కాకుండా తరచూ శరీరాన్ని కదిలిస్తూ ఉండటం..

ఇలా మొత్తం ఎనిమిది అంశాలు ఆయుర్దాయాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయనే నిర్ధారణకు వచ్చారు నిపుణులు. జీవనశైలిలో సర్దుబాట్ల ద్వారా ఏడు నుంచి పదేళ్ల కాలం ఆయును పెంచుకోవచ్చని బ్రిటన్‌లో నిర్వహించిన ‘బయోబ్యాంక్’ అధ్యయనం స్పష్టం చేసింది.