calender_icon.png 11 October, 2024 | 5:05 AM

బంగారు తల్లులను బతకనిద్దాం!

11-10-2024 12:00:00 AM

బాలిక అంటే భారం,ఆడపిల్లంటే అత్తారింటి ఆడదే..ప్రపంచవ్యాప్తంగా అమ్మాయిల పట్ల ఉన్న భావన ఇదే. ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లలోపు వయసున్న బాలికలు 110 కోట్ల మంది ఉన్నారు. విశ్వవ్యాప్తంగా బాలికల పలు సమస్యలు, భద్రత, సాధికారత, లింగ వివక్ష, విద్య వంటి అంశాలను చర్చించడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కెనడా మహిళ రోనా ఆంబ్రోస్ చొరవతో  ఐక్యరాజ్యసమితి 2012 నుండి ప్రతియేటా అక్టోబర్ 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’  నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

బాలికలను విద్యకు దూరం చేయడం, అమ్మాయిల్ని వంటింటికి పరిమితం చేయ డం, బాల్యవివాహాలు, పోషకాహారలోపం, హక్కుల్ని కాలరాయడం, కుటుంబంలో నిర్ణయాధికారం లేకుండా ద్వితీయ శ్రేణి పౌరు రాలిగా పక్కన బెట్టడం, లైంగిక హింసలు, మానభంగాలు, లింగ వివక్ష లాంటి పలు సమస్యలు అనాదిగా వస్తున్నాయి.

విశ్వవ్యాప్తంగా 6.2 కోట్ల మంది బాలికలు నిరక్షరాస్యతతో సతమతమవుతూ వంటింటికి, తమ వృత్తులకే పరిమితం అవుతు న్నారు. బాలికల్లో 25 శాతం బలవంతంగా బాల్యవివాహాలు ఉచ్చులో పడుతున్నారు. ప్రపంచ బాల్యవివాహాలలో 33 శాతం భారత్‌లో జరుతున్నాయని అంచనా. భార త మహిళల్లో 75 శాతం ఏదో ఒక గృహ హింసకు గురి అవుతున్నారు.  గ్రామీణ బాలికలు అసంఘటిత రంగాల్లో కూలీలుగా తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. 

 కౌమారదశలో ఉన్న అమ్మాయిలను లింగ వివక్ష లేకుండా సాధారణ జనజీవన స్రవంతిలోకి ఆకర్షించడానికి ప్రభుత్వాలు పలు చట్టాలను చేసి అమలు చేస్తున్నాయి. బాలికలకు విద్య, ఉద్యోగం, ఆరోగ్య సదుపాయాలు, గౌరవప్రద జీవితం, ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, లైంగిక వేధింపుల కట్టడి,  బాల్యవివాహాల రద్దు, అన్ని రంగాల్లో సమాన అవకాశాల కల్పన లాంటి సకారాత్మక చర్యలు తీసుకుంటున్నారు.

మహిళ అంటే అమ్మ, ఆలి, అక్క, చెల్లి, బాధ్యతగల పౌరురాలు, నాయకురాలువంటి అనేక పాత్రలు నిర్వహిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. మహిళా సాధికారతతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యపడు తుంది.

2021 వరకు ప్రపంచంలో 43.5 కోట్ల్ల మహిళలు దినసరి కనీస ఆదాయం పొందలేని దుస్థితిలో ఉన్నారని అంచనా. దీనికి తోడుగా కోవిడ్-19 కల్లోలంతో లక్షల మంది అమ్మాయిలు పేదరికంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ 60 శాతం ప్రపంచ దేశాల్లో లింగ వివక్ష అనాదిగా ఆచారంగా పాటించబడుతోంది. 

భారతదేశంలో 2020 అంచనాల ప్రకారం 108 మంది పురుషులకు 100 మంది మహిళలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పురుషులు 50.4 శాతం , స్త్రీలు 49.6 శాతం ఉన్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గడానికి భ్రూణహత్యలకు పాల్పడడం, ఆరోగ్య సదుపాయాల లేమి, బాల్యవివాహాలతో కౌమారదశలోనే గర్భం దాల్చడం, ప్రసూతి ఆసుపత్రులు సమీపంలో లేకపోవడం, అవిద్యతో అవగాహనాలేమి లాంటి వి కారణాలుగా చ్రెప్పవచ్చు.

భ్రూణహత్యల్లో 90 శాతం గర్భస్థ శిశువు ఆడపిల్ల కారణమని తేలింది. దీనిని గమనించిన ప్రభుత్వాలు లింగనిర్థారణ పరీక్షలను నిషేధించింది. భ్రూణహత్యల నిరోధానికి ‘కిశోరి శక్తి యోజన’,ప్రసూతి వైద్య సదుపాయాల కల్పనకు ‘సమృద్ధి యోజన’, వైద్య సదుపాయాల కల్పనకు ఆయుష్మతి యోజన’ పథకాలను అమలు చేస్తున్నారు. 2015లో బేటీ బచావో, బేటీ పడావో పథకంతో కేం ద్ర ప్రభుత్వం బాలికల అభ్యున్నతికి కృషి చేస్తున్నది.

అమ్మాయిల మానసిక, సాంఘి క, భౌతిక, ఆర్థిక సమస్యలను అధిగమించడానికి తగు చర్యలు తీసుకోవాలి. యువతు లపై యాసిడ్ దాడులు, భ్రూణహత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, భౌతిక గృహ హింస, కిడ్నాప్‌లు లాంటివి జరుగకుండా కఠిన చర్యలు తీసుకోవడం ప్రభు త్వాల కనీస బాధ్యత.

చదువులో సరస్వతి, సంపదలో లక్ష్మి, ధైర్యంలో దుర్గామాతలు మనకు ఆదర్శ మహిళలని నమ్మిన సంస్కృతి గల భారత దేశంలో యువతుల పట్ల వివక్ష జాతికే సిగ్గు చేటు. మహిళలో అమ్మను, చెల్లిని చూద్దాం. అమ్మాయిలను మహాశక్తి రూపాలుగా, ఆది దేవతలుగా ఆరాధిద్దాం. 

 బి.ఎం.ఎస్ రెడ్డి