- శిల్పారామంలో ఈ నెల 21న ప్రారంభం
- ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్
- హాజరు కానున్న 12 దేశాల ప్రతినిధులు
- వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి) : హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవమైన ‘లోక్ మంథన్’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ హాజరవుతారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతీయ భావజాలంతో నడిపే లోకమంథన్ కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరగడం గొప్పవిషయమన్నారు. టూరిజం ప్లాజాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
“ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచ సమస్యలపై మీద చర్చ జరిపి పరిష్కారానికి ఆలోచనా విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి కావాల్సిన వ్యవస్థను నిర్మించుకోవడం” లోకమంథన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నవంబర్ 15ను జాతీయ గిరిజన గౌరవ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని.. ఈ కార్యక్రమంలో వందలాది గిరిజన కళాకారులు వారు చేసిన చేతివృత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు.
గతంలో ఈ కార్యక్రమం భోపాల్, రాంచీ, అస్సాంలో జరిగిందని.. దక్షిణాదిలో మొదటిసారి జరుగుతున్నదన్నారు. 21వ తేదీన స్టాల్స్, ఎగ్జిబిషన్స్, రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారన్నారు. 22న రాష్ర్టపతి చేతుల మీద కార్యక్రమం ప్రారంభమై ౨౪వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
12 దేశాల ప్రతినిధులు, 100మంది వక్తలు హాజరవుతారని.. వందకు పైగా సాంస్కృతిక కార్యక్రమాల్లో వెయ్యి మంది కళాకారులు పాల్గొంటారని తెలిపారు. కళాప్రదర్శనలు, స్టాల్స్, ఎగ్జిబిషన్‌ను చూడటానికి ప్రజలు తరలిరావాలని కిషన్‌రెడ్డి ఆహ్వానించారు.