వివాదం మొదలైన వెంటనే స్పందించిన మంత్రి
హైదరాబాద్, జూలై 18 ( విజయక్రాంతి): కంపెనీలను ఏపీకి రప్పించే విషయంలో మంత్రి నారా లోకేశ్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే తెలంగాణలో అనుమతుల విషయంలో ఇబ్బందులు పడుతున్న కంపెనీలను ఆకర్షించే ప్రయత్నం చేసిన లోకేశ్ ఇప్పుడు బెంగళూరు కంపెనీలపై దృష్టి సారించారు. తాజాగా బెంగళూరులో నాస్కామ్ వివాదం చెలరేగిన వెంటనే.. లోకేశ్ చాకచక్యంగా స్పందించారు. ఐటీ, ఏఐ, డేటా సెంటర్ల విస్తరణకు విశాఖ అనుకూలమని, నాస్కామ్‌ను ఆహ్వానిస్తున్నామని, ఇక్కడికి వస్తే అన్ని విధాల సహకరిస్తామని లోకేశ్ ట్వీట్ చేశారు. తెలంగాణకు వచ్చే పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏపీ సర్కారు రంగంలోకి దింపిందని వార్తలు వస్తున్నాయి.
నాస్కామ్ వివాదం ఏంటి?
కర్ణాటక ప్రభుత్వం ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఓ బిల్లును తీసుకొస్తుంది. ప్రైవేట్ కంపెనీల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో పూర్తిగా స్థానికులను నియమించాలని రాష్ర్ట కేబినెట్ నిర్ణయించింది. ఇదే కర్ణాటకలో వివాదానికి కారణమైంది. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలన్న బిల్లుపై నాస్కామ్ (నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బిల్లు వల్ల కంపెనీల్లో నిపుణులైన ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు తరలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ.. ఆ రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. నాస్కామ్ అసంతృప్తిని ఆసరాగా చేసుకున్న లోకేశ్ ఏపీకి రావాలని ఆహ్వానించడం గమనార్హం.