05-03-2025 08:14:49 PM
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి..
రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి శ్రీదేవి..
ఎల్బీనగర్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాలతో మార్చి 8న (రెండో శనివారం) రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. గతంలో కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు వీటిలో పరిష్కరించుకునే లేదా రాజీ చేసుకునే కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార కార్యదర్శి శ్రీదేవి సూచించారు. ఈ మేరకు ఎల్బీనగర్ లోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ... లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరిస్తే గతంలో కక్షిదారులు కోర్టులో చెల్లించిన ఫీజును తిరిగి చెల్లిస్తారని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలకు సమయం, డబ్బు ఆదా అవుతుందన్నారు. లోక్ అదాలత్ లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, రోడ్డు ప్రమాద కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్స్ కేసులతో పాటు రాజీకి వీలున్న కేసులు పరిష్కరించుకోవచ్చని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి సూచించారు.