24-03-2025 12:00:00 AM
అన్నంభట్టు
‘తర్కం’ ఒక ప్రత్యేక శాస్త్రంగా అభివృద్ధి చెందిన భారతదేశంలో ఎం దరో మహామహా విద్వద్వరేణ్యులు ఈ శాస్త్రాధ్యయనం చేసి తర్కశాస్త్ర ప్రావీణ్యాన్ని సంపాదించి మహాతార్కికులుగా గణుతికెక్కారు. అటువంటి ప్రసిద్ధులలో పేరెన్నిక గన్న మహామహుడు అన్నంభట్టు. తర్కం అనగానే స్ఫురించే విద్వన్మూర్తి ఆయన. అన్నంభట్టు శాస్త్రవిద్య అయిన తర్కాన్ని కౌండిన్యపురంలోను, కాశీలోను అధ్యయనం చేసి వచ్చిన పండితుడు.
కాశీకి వెళ్లినంత మాత్రాన అంద రూ అన్నంభట్టు అం తటి విద్వాంసులు కాలేరంటూ ‘కాశీ గమన మాత్రేణ నా న్నం భట్టాయతే ద్విజః’ అ న్న నానుడి కూడా ప్రసిద్ధంగా లోకంలో వినిపిస్తుంది. కాశీకి వెళ్లి విద్యను ఆర్జించవచ్చు కాని, ప్రతిభాశాలియైన ఈ అన్నం భట్టుకు ఇందులో ఎవ్వ రూ సాటిలేరు. దీనినిబట్టి ఆయన ఎంతటి జ్ఞాన మూర్తియో అర్థమవుతున్నది.
అన్నంభట్టు తెలగాణ్యుడైన బ్రాహ్మణ పండితు డు. ఈయన పూర్వులు కూడా మహాపండితులే. తండ్రి తిరుమలభట్టుకు ‘సర్వతోముఖయాజి’ అనే బిరుదు ఉంది. ఆయన ‘సంధ్యావందన భాష్యం’ రచించా డు. అన్నంభట్టు తాత మల్లుభట్టు కూడా మహాపండితుడే. ‘ఆలోక స్ఫూర్తి’ పేరున న్యాయశాస్త్ర సంబంధమైన గ్రంథాన్ని, ‘తత్త వివేచనము’ అనే వేదాంత సంబంధమైన గ్రంథాన్ని, ‘మహాభాష్య టీక’ అనే వ్యాకరణ శాస్త్ర సంబంధమైన గ్రంథాన్ని రచించిన పండితుడు.
‘అగ్నిహోత్ర భట్టు’గా ఖ్యాతి గడించిన మహనీయుడు. అన్నంభట్టు ము త్తాత లోకనాథ భట్టు కూడా ‘ద్వాదశ యజ్వ’గా కీర్తిని గడించాడు. వీరి మూలపురుషుడైన ‘రాఘవ సోమయాజి’ అద్వైతాచా ర్యునిగా ప్రసిద్ధి చెందిన వాడు. అలాగే, అన్నంభట్టు సోదరుడైన ‘సర్వదేవుడు’ కూడా పండితుడు కావడం విశేషం.
మహావిద్వాంసుల వారసత్వం
మహావిద్వాంసులైన తాతముత్తాతల వారసత్వం కలిగిన అన్నంభట్టు కూడా తర్క, వేదాంత, మీమాంస, వ్యాకరణాది శాస్త్రాల్లో పారం ముట్టిన పండిత వరేణ్యుడు. పలు శాస్త్రగ్రంథాల రచయిత. ‘తర్క సంగ్రహము’, ‘తర్క సంగ్రహ దీపిక’, ‘తర్క భాషా తత్తబోధిని’ అనే రచనలేగాక, జయదేవుని రచన అయిన ‘ఆలోకము’ అనే తత్త చింతామణికి ‘ఆలోక సిద్ధాంజనము’ అనే వ్యాఖ్యాన గ్రంథాన్ని కూడా రచించాడు.
అంతేగాక, రఘనాథ శిరోమణి రచించిన ‘దీధితి’కి ‘సుబుద్ధి మనోహరము’ అనే వ్యాఖ్యాన గ్రంథా న్ని సైతం రచించాడు. ఇవేగాక ఒక్కొక్క శాస్త్రానికి దా దాపు రెండు రెండు గ్రంథాలను రచించిన విద్వత్తు అన్నంభట్టుది. మీ మాంసా శాస్త్రానికి సంబంధించి ‘రాణకోజ్జీవిని’, ‘తంత్రవార్తిక టీక’ పేర్న గ్రంథాలను, వేదాంత శాస్త్రానికి సంబంధించి బ్రహ్మసూత్రాలకు సరిపోయే వ్యాఖ్యాలుగా ‘మితాక్ష ర’, ‘తత్త వివేచన’ అనే రెండు గ్రంథాలను పాణిని మహర్షి ‘అష్టాధ్యాయి’కి కూడా ‘మితాక్షర’ అనే గ్రంథాన్ని సరళ విధానంలో రచించాడు.
అన్నంభట్టు ‘వేదం’ గురించిన ‘స్వర లక్షణము’ను, కైయటుని ‘ప్రదీపము’ అనే గ్రంథంపై ‘భాష్య ప్రదీపోద్ద్యోతనము’ అనే గ్రంథాలు కూడా రచించాడు. ఇవి అన్నంభట్టు బహుముఖీన ప్రతిభకు దర్పణాలు. అందుకే, ఆయన శాస్త్ర విషయాల లో ‘పదవాక్య ప్రమాణ పారావారీణుడు’గా కీర్తిని అందుకున్నాడు.
అర్చకులుగా తాతముత్తాతలు
అన్నంభట్టు జన్మస్థలాన్ని పలువురు సాహితీవేత్తలు ‘గరికపాడు’గా భావించారు. కానీ, సుప్రసిద్ధ పరిశోధకులు, పండిత కవి అయిన కీ.శే. డా. కపిలవాయి లింగమూర్తి ‘మహాక్షేత్రము మామిళ్లపల్లి’ అనే గ్రంథం లో ‘నేటి నాగర్‌కర్నూలు జిల్లా, నాటి మహబూబ్‌నగర్ జిల్లాలోనిది అయిన మామిళ్ల పల్లి గ్రామచరిత్రను అనేక శాసన ప్రమాణాలతో రచిస్తూ, “ఈ అన్నంభట్టు తాతము త్తాతలు అక్కడి లక్ష్మీనరసింహస్వామి అర్చకులుగా” తెలిపారు.
కాశీలో శాస్త్రవిద్యను అభ్యసించి వచ్చిన అన్నంభట్టు 1560 ప్రాంతంలో సదాశివరాయల వారినుండి ఈ ‘గరికపాడు’ అగ్రహారాన్ని అందుకున్న ట్టు తెలుపుతూ, నాటినుండి వీరి ఇంటిపేరు ‘గరికపాటి వారి’గా మారిందన్నారు. ప్రము ఖ విద్వాంసులు డా. సంగనభట్ల నర్సయ్య కూడా “అన్నంభట్టు గ్రంథాల్లో పేర్కొన్న ఇంటిపేరైన ‘మామిళ్లపల్లి’నిబట్టి వీరి స్వస్థలం మామిళ్లపల్లిగానే నిర్ధారించారు.
గరికపాటి లక్ష్మీకాంతయ్య కూడా విపులమైన తమ వ్యాసంలో “అన్నంభట్టు పూర్వు లు ‘మామిళ్లపల్లి’ వాసులేనని” పేర్కొన్నా రు. “తెనాలి తాలూకాలో ఒక మామిళ్లపల్లి ఉంది. కానీ, వీరి పూర్వులది మహబూబ్‌నగర్ (నేటి నాగర్‌కర్నూల్) జిల్లాలోని మామిళ్లపల్లి గ్రామమేనని” ఆయన నిర్ధారించారు.
“వీళ్లంతా తెలగాణ్య శాఖా బ్రాహ్మ ణులని అనిపించుకోవడానికి వీరు తెలంగాణ ప్రాంతం వారు కావడమే కావచ్చు నని” కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ‘విజయనగర రాజ్య పతనానంతరం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు తుంగభద్ర దక్షిణదేశానికి వలస వచ్చినట్టుగా పేర్కొని, ఆ విధంగా వలస వచ్చిన కుటుంబాలలో వీరి కుటుంబం కూడా ఒకటై ఉంటుందని’ లక్ష్మీకాంతయ్య భావించారు.
పేరిభట్టు సమకాలికుడు
బహువిధాలైన శాస్త్రాల అధ్యయనం వల్ల ఘనమైన మన్ననలు పొందిన అన్నంభట్టు ‘మహాభాష్య ప్రదీపోద్ద్యోతనము’ అనే వ్యాకరణ గ్రంథవ్యాఖ్యలో “తమ గురువైన ‘శ్రీ శేషవీరేశ్వరుని’ ప్రసక్తిని తీసుకొని వచ్చాడు. దీనినిబట్టి డా. సంగనభట్ల నర్సయ్య ‘ఆయన గురువు ఈ శేషవీరేశ్వరుని’ గురించి మరికొన్ని వివరాలను కూడా వెలిబుచ్చారు.
ఈ శేషవీరేశ్వరుని సంస్మరిస్తూ
“శ్రీ శేష వీరేశ్వర పండితేంద్రం
శేషాయితం శేషవచో విశేషే
సర్వేషు తంత్రేషుచ కర్తృతుల్యం
వందే మహాభాష్య గురుం మామగ్య్రం”
అన్నాడు అన్నంభట్టు.
ఆయన ఆదిశేషుని వంటి వచోవైభవం గల మహాభాష్య గురువైన వీరేశ్వరుని కీర్తించాడు. ఈ విషయాన్ని వివరిస్తూ సంగన భట్ల “ఈ శేష వీరేశ్వరుడు రసగంగాధర కర్త అయిన జగన్నాథ పండిత రాయలవారి తండ్రి అయిన పేరిభట్టుకు కూడా గురువేనని” రసగంగాధరంలోని ‘శేషాంతప్రాప్త శేషాచల భణితిరభూత్ సర్వవిద్యాధరోయః’ అన్న శ్లోకాన్నిబట్టి చెప్పవచ్చునని పేర్కొన్నా రు. అంటే, దీనినిబట్టి అన్నంభట్టు పేరిభట్టు ల వారి సమకాలికుడని భావించవచ్చు. 16వ శతాబ్ది వాడైన రఘునాథ శిరోమణి రచన ‘మణి దీధితి’కి అన్నంభట్టు వ్యాఖ్య రాసిన వాడు గనుక ఈయన కూడా 16వ శతాబ్దం వాడేనని నిర్ధారింపవచ్చు.
బోధనాలయాలకు పాఠ్యాంశంగా!
అన్నంభట్టు గ్రంథాలలో రెండు వ్యాకరణ శాస్త్రంపై, ఒకటి వేదస్వరంపై, ఐదు తర్కశాస్త్ర విషయంపై, మరో రెండు మీ మాంస, రెండు వేదాంతంపైన ఉన్నాయి. కాని, ‘తర్క సంగ్రహం’ ఒక్కటి మాత్రం యా వద్భారతంలో అశేష కీర్తిని ఆర్జించింది. ఆ గ్రంథం నేటికీ అనేక సంస్కృత బోధనాలయాలకు చెందిన పాఠ్యాంశాల్లో భాగంగా నిలబడటం ఆయన ప్రతిభకు దర్పణం.
ఈ ఒక్క ‘తర్క సంగ్రహ’ గ్రంథానికి అనేకమం ది పండితులు వ్యాఖ్యలు రాశారు. గరిమెళ్ల సోమయాజులు శర్మ “ఇటువంటి వ్యాఖ్యానాలు దాదాపు నలభై వరకు ఉండవచ్చు” అని భావించారు. ఈ రకమైన వ్యాఖ్యానా లు రాసిన వారిలో అధిక శాతం సంస్కృత విద్యాలయాల్లోని బోధకులే కావడం గమనార్హం. పఠన పాఠనాదుల్లో శాశ్వతంగా నిలి చిపోయిన గ్రంథంగా దీనిని భావించవచ్చు.
అన్నంభట్టు పరిశ్రమించిన తర్క వ్యాకరణాలు మానవ సాహిత్య జీవితానికి, సామా జిక జీవితానికి కూడా అధికంగా ఉపయోగపడతాయి. ఈ భావన నుంచే ‘కాణాదం పాణినీయంచ సర్వశాస్త్రోప కారకమ్’ అన్నమాట పుట్టిందేమో. “ఉపాధ్యాయ శబ్దవా చ్యుడు, అన్నంభట్టోపాధ్యాయునికి పదవాక్య ప్రమాణ పారావార పారీణుడన్న వైభవం తర్కశాస్త్ర పాండిత్యం వల్లే వచ్చిం ది” అన్న నర్సయ్య అభిప్రాయం అక్షరసత్యం.
కాశీలో విద్యాలయం
అన్నంభట్టు కాశీలో విద్యాభ్యాసం చేసిన వాడు మాత్రమే గాక అక్కడ ఒక గురుకులం కూడా నడిపినట్లు తెలుస్తున్నది. ‘అందరూ కాశీలో విద్యాభ్యాస తదనంతరం వెళ్లిపోయే వారే అయినా అన్నంభట్టు మాత్రం అక్కడే విద్యాలయం నడిపి కీర్తిమంతుడు అయ్యాడని’ చరిత్రకారులు పేర్కొన్నారు. “ఆయన ‘కౌండిన్యపురం’లో విద్యను అభ్యసించాడనీ, కౌండిన్యపురమే కొండవీడు” అని జమ్మలమడక మాధవ రామశర్మ అభిప్రాయపడ్డారు. కానీ, డా. సంగనభట్ల నర్సయ్య దానిని ఖండించి, “అది ఏదైనా ‘కొండాపురం’ అయి ఉండవచ్చునని” పేర్కొన్నారు.