చోరి కేసులో అదుపులోకి తీసుకొని దారుణం
నేరం అంగీకరించాలని చిత్రహింసలు
ఆమె కుమారుడి పైనా దాడి
షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, నలుగురు సిబ్బంది పైశాచికం
స్పందించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ను హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్
రంగారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): సభ్య సమాజం తలదించు కునేలా షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నలుగురు సిబ్బందితో కలిసి దారుణానికి ఒడిగట్టాడు. చోరీ కేసులో దళిత మహిళపై కర్కశంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. చిత్రహింసలు పెట్టాడు. అంతేకాదు ఆమె కుమారుడిపైనా దాడికి పాల్పడ్డాడు.
శనివారం ఈ అవమానవీయ ఘటన శనివారం వెలుగు చూసింది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణం లోని అంబేద్కర్ కాలనీలో నాగేందర్ అనే వ్యక్తి నివాసిస్తున్నాడు. ఇంట్లో కొందరు చొరబడి గత నెల 24న బంగారం, నగదు అపహరించాడని నాగేందర్ పోలీసులను ఆశ్రయించాడు.
డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌రెడ్డి , సిబ్బంది రఫీ, మోహన్‌లాల్, కరుణాకర్, అఖిల రంగంలోకి దిగి నాగేందర్ ఇంటి పక్కన నివసిస్తున్న అనుమానితులు సునీత, భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత భీమయ్యను వదిలేశారు. ఆ తర్వాత దంపతుల కుమారుడు 13 ఏళ్ల జగదీష్ సైతం అదుపులోకి తీసుకుని అతడిపై చేయి చేసుకున్నారు. సునీతను థర్డ్ డిగ్రీ పేరిట చిత్రహింసలకు గురిచేయ గా ఆమె తీవ్రగాయాల పాలైంది. అనంతరం బయటకు
వచ్చిన బాధితురాలు తాను అనుభవించిన చిత్రహింసలను ఏకరువు పెట్టింది. తన కుమారుడు జగదీశ్ కళ్లముందే థర్డ్ డిగ్రీకి పాల్పడ్డారని కన్నీటి పర్యంతమైంది. ‘చోరీకి పాల్పడ్డట్టు ఒప్పుకుంటావా ?’ లేదా అంటూ చెప్పలేని భాషలో దూషించారని ఆవేదన వ్యక్తం చేసింది. కుమారుడు జగదీశ్వర్‌ను నేలపై పడుకొబెట్టి కాళ్లపై రబ్బర్ బెల్ట్‌తో బాదారని వాపోయింది.
దెబ్బలకు తాళలేక తాము స్పృహ కోల్పోవడంతో తనను ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించారని తెలిపింది. పది రోజులైనా నిందితురాలిని పోలీసులు ఎందుకు రిమాండ్‌కు పంపించకపోవడం వెనుక మతలబు ఏమిటి.. అనే చర్చ ఇప్పుడు ప్రారంభమైంది. మహిళతో అమానవీయంగా ప్రవర్తించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
బంగారం దొరికింది
నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని, చోరీ చేసింది ఆమెనని ఫిర్యాదు దారులు పోలీసులను ఆశ్రయించారు. 26 తులాల బంగారంతో రూ.2 లక్షల నగదు అపహరణకు గురయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటివరకు ఒక తులం బంగారంతో పాటు రూ.4 వేల రికవరీ చేసినట్టు తెలుస్తోంది.
కేసు నమోదు చేశాం
మహిళపై థర్డ్ డిగ్రీపై షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామ్‌రెడ్డిని వివరణ కోరగా.. సునీత అనే మహిళ పై కేసు నమోదు చేశామని, విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు. విచారణలో భాగంగానే ఆమెను స్టేషన్‌కు తీసుకువచ్చామన్నారు. బంగారం ఆమె తీసుకుందనే విషయం ఇప్పుడే తేల్చలేదన్నారు. ప్రస్తుతం ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.
థర్డ్ డిగ్రీపై స్పందించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి) : దొంగతనం అంగీకరించాలని ఓ మహిళను చిత్రహింసలకు గురి చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డిని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదివారం రాత్రి సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై షాద్‌నగర్ ఏసీపీ ఎన్సీహెచ్ రంగస్వామి విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ
బాధితురాలు సునీతను ఆదివారం రాత్రి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కీ వెంకటయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంతో పాటు ఆయా కమిషన్ సభ్యులు, కార్పొరేషన్ ప్రతినిధులు పరామర్శించారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని బాధితురాలు కమిటీ సభ్యులను ఆమె వేడుకున్నది.
ఈ సందర్భంగా అనంతరం కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. పోలీసులు నిబంధనలు మిరీ మహిళను చిత్రహింసలకు గురిచేయడం తనను కలచివేసిందన్నారు. సదరు పోలీస్ అధికారితోపాటు సహకరించిన సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రప్రభుత్వం తరఫున బాధితురాలికి అండదండలు ఉంటాయని భరోసానిచ్చారు.