15-03-2025 12:07:51 AM
నిజామాబాద్, మార్చి 14 (విజయక్రాంతి): పోలీస్ కస్టడీలో ఉన్న రిమాండ్ ఖైదీ నిజామాబాద్‌లో లాకప్ డెత్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్(34) ఏజెంట్‌గా విదేశాల్లో ఉద్యోగాల నియామకాల కోసం మాన్ పవర్ కన్సల్టెన్సీ పేరున నిజామాబాద్‌లో కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ బ్రాంచిని నిర్వహిస్తున్నాడు.
సంపత్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లిన అనేక మం ది యువకులకు పని దొరక్కపోవడంతో తప్పుడు వీసాలు ఇచ్చి గల్ఫ్‌కు పంపి మోసం చేశాడంటూ నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి సంపత్‌తో పాటు తనతో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మరో నిందితుడిని అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.
తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరి నిందితులను గురువారం జగిత్యాలలోని మాన్ పవర్ కన్సల్టెన్సీ కార్యాలయానికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ తనిఖీలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్న అనంతరం రాత్రి నిజామాబాద్‌కు తిరుగు పయణమయ్యారు.
మార్గమధ్యంలోనే సంపత్‌ను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సంపత్‌కు ఇద్దరు భార్యలు, నలుగురు సంతానం ఉన్నట్టు తెలుస్తోంది.
గుండెపోటుతోనే..: సీపీ
పోలీస్ కస్టడీలో ఉన్న సంపత్ గుండెపోటుతో మృతి చెందాడని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. జగిత్యాల నుంచి విచారణ అనంతరం గురువారం రాత్రి సంపత్‌ను సురక్షితంగా సీసీఎస్‌కు తరలించామని తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో తనకు ఛాతిలో నొప్పి వస్తుందని, ఎడమ చేయికి తీవ్రంగా నొప్పి కలుగుతుందని సంపత్ చెప్పడంతో వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు.
ఆసుపత్రి లో నడుచుకుంటూ వెళ్లిన సంపత్ 10:29 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సీపీ తెలిపారు. ఆసుపత్రిలో సంపత్ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ఆయన మృతిపై నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌కు సైతం నివేదిక పంపినట్టు కమిషనర్ తెలిపారు.
పోలీసులు కొట్టారు: బంధువులు
సంపత్ మరణ వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. సంపత్ మృతదేహాన్ని పరిశీలించి పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, ఆరోగ్యంగా ఉన్న మనిషికి గుండెపోటు రావడం ఏమిటని ఇదంతా పోలీసుల కట్టుకథ అని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు.