అద్దెలు చెల్లించకపోవడంతో భవన యజమానుల నిరసన
రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఘటనలు
70 శాతం బడులు అద్దె భవనాల్లోనే..
ఇబ్బందుల పడుతున్న విద్యార్థులు
పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తాం
తాళం వేసిన వారిపై కేసు పెట్టండి
అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
సాయంత్రానికి తెరుచుకున్న పాఠశాలలు
హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని గురుకుల పాఠశాల లకు మంగళవారం తాళాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండటం.. ప్రభుత్వం వాటికి అద్దె చెల్లించకపోవడంతో భవన యజమానులు నిరసనగా ఈ చర్యకు పాల్పడ్డారు.
ఇప్పటికే సమస్యల వలయంలో చదువులు సాగిస్తున్న విద్యార్థులకు కొత్తగా అద్దె భవనాల రూపంలో మరో సమస్య ఆటంకంగా మారుతున్నది. తెలంగాణలోని ఆయా గురుకుల సొసైటీల కింద కొనసాగుతున్న పాఠశాలల్లో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
అయితే అద్దె భవనాల యజమానులకు సమయానికి కిరాయి చెల్లించకపోవడంతో పలు గురుకులాల్లో సౌకర్యాలేమీ సమస్య విద్యార్థులను తీవ్రంగా వేధిస్తున్నది. దీనికితోడు ఇప్పుడు అద్దె చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో భవన యజమానులు ఏకంగా పాఠశాలల గేట్లకు తాళాలు వేశారు.
కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతోనే గురుకుల పాఠశాలల గేట్లకు తాళం వేసి నిరసన తెలపాల్సి వచ్చిందని ఆయా భవనాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితో సాయంత్రానికి చాలా వరకు గురుకుల పాఠశాలలు తెరుచుకున్నాయి.
70 శాతం వరకు అద్దె భవనాల్లోనే...
తెలంగాణలో ప్రస్తుతం 1023 రెసిడెన్షియల్ గురుకులాలున్నాయి. వీటిలో 662 గురుకులాలు ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జనరల్ క్యాటగిరిలోని 35 గురుకులాల్లో మినహా మిగిలిన అన్నింట్లో దాదాపు 70 శాతం అద్దె భవనాల్లోనే నిర్వహిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 327 బీసీ గురుకులాలు ఉండగా, వీటిలో 306 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నా యి. మొత్తం 268 ఎస్సీ గురుకులాలకుగానూ 135 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 185 ఎస్టీ గురుకులాల్లో 42 పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.
205 మైనార్టీ గురుకులాలుండగా, వీటిలో 179 పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అద్దె భవనాల్లో నిర్వహణ కొనసాగుతుండటంతో ఇప్పటికే అరకొర వసతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి.
పలుచోట్ల గురుకులాలకు తాళం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపాలిటీలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలల గేట్లకు ఆయా భవనాల యజమానులు తాళం వేశారు. వీటితోపాటు హుజూర్‌నగర్ మైనార్టీ గురుకుల పాఠశాల గేటుకు సైతం యజమాని తా ళం వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలకు, అదే జిల్లాలోని తాండూర్ మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలకు యజమానులు తాళం వేసి నిరసన తెలిపారు. గురుకుల పాఠశాలల అద్దె భవనాల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
గేటు బయటే విద్యార్థులు
దసరా సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లారు. సోమవారంతో సెలవులు ముగియడంతో మంగళవారం తిరిగి పాఠశాలలకు చేరుకున్నారు. అయితే, సెలవుల కారణంగా పాఠశాలలు ఖాళీకావడంతో ఇదే అదనుగా భావించిన భవనాల యజమానులు రాష్ట్రంలోని పలుచోట్ల పాఠశాలల గేట్లకు తాళాలు వేశారు.
అద్దె చెల్లించాలని ఈ రకంగా తమ నిరసన తెలిపారు. దీంతో పాఠశాల ప్రారంభమైందని వచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, సిబ్బంది అందరూ గేటు బయటే ఉండాల్సి వచ్చింది. అద్దె భవనాల యజమానులు తాళాలు వేసిన చోట్ల అంతటా ఇదే పరిస్థితి నెలకొంది.
తాళాలేసిన వారిపై కేసులు పెట్టండి
అద్దె చెల్లించడం లేదని గురుకుల పాఠశాలలకు భవన యజమానులు తాళం వేయడం మంచి పద్ధతి కాదు. బకాయిలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. నేడోరేపో నిధుల విడుదల చేసే సమయంలో ఎవరి మాటలో పట్టుకొని కవ్వింపు చర్యలకు పాల్పడవద్దు. ఇవి గత పదిరోజుల్లో ఉన్న బకాయిలు కాదు.
కొన్నేళ్లుగా రాని అద్దెను అడగలేక వారు తాళాలు వేశారు. బకాయిలు చెల్లించే బాధ్యత మాదే. సీఎం రేవంత్‌రెడ్డిని గానీ, మమ్మల్ని గానీ, అధికారులను గానీ కలవాలి. విద్యార్థులకు సక్రమంగా తరగతులు నిర్వహించేలా సహకరించాలి. లేదంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం.
భవనాల యజమానులు ఎక్కడైనా ఇబ్బందులు పెడితే ప్రిన్సిపల్, ఆర్సీవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. క్రిమినల్ చర్యలు తీసుకోండి. గురుకుల పాఠశాలల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు వేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశాం.
మంత్రి పొన్నం ప్రభాకర్