calender_icon.png 15 November, 2024 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్డోజర్లకు తాళం

14-11-2024 12:00:00 AM

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చట్టం నిర్దేశించిన విధివిధానాలను పాటించకుండా  కేవలం నిందితుడు లేదా దోషిగా ఉన్నందున ఏ పౌరుడి ఆస్తినైనా కూల్చివేయడం ‘పూర్తిగా రాజ్యాం గ విరుద్ధం’ అని స్పష్టం చేసింది. దేశంలోని  వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఆస్తుల కూల్చివేతలపై మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్లపై  బుధవారం తీర్పు వెలువరిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసులో తీర్పును ధర్మాసనం అక్టోబర్ 1న రిజర్వ్ చేసింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని కూడా స్పష్టం చేసింది. ఒక వేళ కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతాలనుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా కొంతకాలంగా బుల్డోజర్ చర్యలు హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఇది కీలక అంశంగా మారింది కూడా. ‘బుల్డోజర్ న్యాయం’ పేరిట పలు రాష్ట్రాలు ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. మొదట యూపీలో మొదలైన ఈ ధోరణి క్రమంగా ఇతర రాష్ట్రా లకూ పాకింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కూడా నిందితుల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించి కూల్చివేయిస్తున్నారు.

మతప్రాతిపదికన ముస్లింల ఇళ్లను మాత్రమే కూల్చివేస్తున్నారంటూ పలు ముస్లిం సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై గత ఆగస్టులో విచారణ చేపట్టిన సుస్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు దీన్ని తప్పుబట్టింది. అయితే రహదారులు, ఫుట్‌పాత్‌లపైన, రైలుమార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల పరిధిలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవంటూ మినహాయింపు ఇచ్చింది. ఈ విషయమై గతంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్యల ద్వారా పౌరుల గొంతునొక్కడం సరికాదని, చట్టబద్ధ పాలన జరుగుతున్న సమాజంలో బుల్డోజర్  న్యాయం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ప్రజల నివాసాల రక్షణ, భద్రత వారి ప్రాథమిక హక్కుల కిందకు వస్తాయని, వాటిని కూల్చివేసే అధికారం ప్రభుత్వాలకు లేదని పేర్కొన్నారు.  అంతేకాదు యూపీలో  2019లో సీనియర్ జర్నలిస్టు మనోజ్ తిబ్రేవాల్‌కు చెందిన పూర్వీకుల ఇల్లు, షాపును అక్రమంగా కూల్చివేసినందుకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని ఈ నెల 6న చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం యోగి ఆదిత్యనాథ్            ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 కాగా సుప్రీంకోర్టు తీర్పుపై  యూపీలోని సమాజ్‌వాది పార్టీ,  బీఎస్పీ, కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తుంటే బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలను అణచివేసేందుకే యోగి ప్రభుత్వం బుల్డోజర్లను ఉపయోగించిందని, ఇకపై బుల్డోజర్లు గ్యారేజికి వెళ్లాల్సిందేనని ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్  వ్యాఖ్యానించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి  సుప్రీంతీర్పుపై స్పందిస్తూ ఇకపై బుల్డోజర్ల భయోత్పాతం అంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఒవైసీ కూడా ఎక్స్ వేదికగా సుప్రీంతీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇంతకు ముందు ప్రధాని బుల్డోజర్ రాజ్‌ను పొగడ్తలతో ముంచెత్తారని,ఈ రోజు సుప్రీంకోర్టు  దాన్ని చట్టవ్యతిరేక చర్యగా పేర్కొందన్నారు. కాగా బీజేపీ నేతలు మాత్రం సుప్రీం తీర్పును ఒక వైపు సమర్థిస్తూనే మరో వైపు అన్ని నిబంధనలు పాటించాలని మాత్రమే కోర్టు చెప్పిందనిబుల్డోజర్ కూల్చివేతపై ఎలాంటి నిషేధం విధించలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా దీనిపై రాబోయే రోజుల్లో పెద్ద రాజకీయ రగడ జరిగే అవకాశాలు లేకపోలేదు.