7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
కులగణనపై చర్చకు 5న రాష్ట్ర క్యాబినెట్ భేటీ!
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై ఫోకస్ పెట్టింది. ఇందుకు ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనికంటే ముందే ఫిబ్రవరి 5న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానున్నట్లు తెలిసింది.
బీసీ కులగణన, రిజర్వేషన్ల అంశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేసేలా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేకు సంబంధించిన సమగ్ర నివేదికను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
ఈ తుది నివేదికను ఫిబ్రవరి 2న క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదించనున్నారు. దీనిపైన ఫిబ్రవరి 5న క్యాబినెట్ భేటీ అయి, చర్చించి దాన్ని ఆమోదం తెలపనుంది. ఆతర్వాత అసెంబ్లీలో కులగణనకు ఆమోదముద్ర వేసేందుకు ఫిబ్రవరి 7న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
కులగణన నివేదికపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదం పొందనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసి, అనంతరం ఎన్నికలు నిర్వహించాలనే ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయి అసెంబ్లీ ప్రత్యేక సమావేశంపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.
కేంద్రం సహకరిస్తేనే బీసీ రిజర్వేషన్ల పెంపు
హైదరాబాద్, జనవరి 30 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నిక లపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నది. గడిచిన పధ్నాలుగు నెలల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు, వ్యతిరేకత రెండూ సమపాళ్లలో వస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో సంకేతాలు వస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పథకాలు, హామీల అమలులో మిశ్ర మ ప్రతిస్పందన కనపడుతోంది.
దీనితో బీసీ రిజర్వేషన్ల అంశం పార్టీ ని గట్టెక్కిస్తుందనే ధీమా మాత్రం పార్టీ పైస్థాయి నాయకత్వంలో ప్రస్పుటంగా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రక్రియను సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ ఎంత వేగంగా పూర్తిచేసినా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఒకింత అయోమయంగా కనపడుతోంది.
రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం మేరకు న్యాయ, చట్టపరమైన అంశాల్లో కేంద్రం సహకరిస్తుందా లేదా.. అనేది ఇతిమిత్ధంగా అర్థం కావడం లేదు. కేంద్రం కూడా ఇదే వేగంతో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పూర్తి చేస్తేనే.. ఫిబ్రవరి మూడో వారం కానీ.. మార్చిలోగానీ స్థానిక ఎన్నికలను నిర్వహించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కలుగుతుంది.
ఒకవేళ కేంద్రంలో ఏమాత్రం ఆలస్యం అయినా.. పదో తరగతి, ఇంటర్ పరీక్షల రూపంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. ఒకవేళ కేంద్రంలో ఆలస్యం జరిగితే.. అలాకూడా రాజకీయంగా లాభం కలిగేలా ప్రచారం చేసుకోవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టుగా కనపడుతోంది.
తాము వేగంగా ప్రక్రియను పూర్తిచేసి పంపిస్తే.. కేంద్రంలోని బీజేపీ కావాలనే బీసీ రిజర్వేషన్ల పెంపును పక్కన పెట్టిందనే విమర్శలతో స్థానిక ఎన్నికల్లో దిగి ఫలితాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ఆలోచన కూడా కాంగ్రెస్ పెద్దల్లో ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకుల అంచనా.
ట్విట్టర్‌లో పరిపాలన పోల్ వైరల్..
గురువారం కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘తెలంగాణలో ప్రజలు ఎలాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు’ అనే ప్రశ్నను సంధించడంతో.. ‘ఫామ్‌హౌజ్ పాలన’కు 67 శాతం.. ‘ప్రజల వద్దకు పాలన’కు 33 శాతం పోల్ రావడంతో అది వైరల్ అయ్యింది. అయితే ఇదంతా బీఆర్‌ఎస్ నేతలు తమ సోషల్ మీడియా మంత్రాంగమని కాంగ్రెస్ నేతలు తిప్పికొట్టినా.. ప్రజల్లో మాత్రం చర్చను రేకెత్తిస్తున్నది నిజం.
ఇది ఒకరకంగా ప్రజలను తికమక పెట్టే అంశమే. కేవలం రాత్రికి రాత్రే 50 వేల ఓట్లను వేయించడంతోనే ఇలాంటి ఫలితం వచ్చిందని కాంగ్రెస్ నేతలు మండిపడటంలోనూ అర్థముంది. అయితే ప్రజలు ఇంతగా సాంకేతికాంశాల్లోకి వెళతారా లేదా అనేది చూడాలి.