calender_icon.png 15 January, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక రిజర్వేషన్ రగడ

18-07-2024 03:10:00 AM

  1. ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు కోటా
  2. విమర్శలతో వెనక్కు తగ్గిన కర్ణాటక సర్కారు
  3. గతంలో మహారాష్ట్రలో బాల్‌ఠాక్రేది ఇదే సిద్ధాంతం
  4. డొనాల్డ్ ట్రంప్‌దీ స్థానిక కోటా సిద్ధాంతమే

బెంగళూరు, జూలై 17: దేశంలో మరోసారి ‘స్థానిక కోటా’ రగడ తెరపైకి వచ్చింది. కర్ణాటకలో ప్రైవేటు ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజ ర్వేషన్ కల్పించే బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలుపటం తీవ్ర వివాదానికి, ఆందోళనకు దారితీసింది. కర్ణాకటలో కార్యకలాపా లు నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలలో మేనేజ్‌మెంట్ స్థాయి ఉద్యోగాల్లో 50 శాతం, నాన్ మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో 70 శాతం కన్నడిగులతోనే భర్తీ చేయాలనే బిల్లుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య బుధవారం ట్వీట్ చేశారు. ‘కన్నడిగులకు మాతృభూమిలో సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వటమే మా ప్రభుత్వ లక్ష్యం. కన్నడిగుల సంక్షేమమే మా ప్రథమ కర్తవ్యం’ అని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థల్లో గ్రూప్ సీ, డీ పోస్టులను వందశాతం కన్నడిగులకే కేటాయించాలని ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తంకావటంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. పారిశ్రామికవర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో ఈ బిల్లును తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. గతంలో మహారాష్ట్రలో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే కూడా ఇలాగే భూమిపుత్రుల సిద్ధాంతం తీసుకొచ్చి పరిశ్రమలను మొత్తం తన చెప్పుచేతుల్లోకి తీసుకొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొచ్చారు. 

ఇలాగైతే మేం వెళ్లిపోతాం

సిద్ధరామయ్య ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై పారిశ్రామికవేత్తలు చిందులు తొక్కుతున్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేస్తున్నది. బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్‌మజుందార్ షా ఈ బిల్లును స్వాగతిస్తూనే అత్యున్నత నైపుణ్యాలున్న ఉద్యోగాల విషయంలో ఈ నిబంధనను మినహాయించాలని సూచించారు. దేశంలోనే అతిపెద్దదైన సాఫ్ట్‌వేర్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఈ బిల్లుపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిం ది. బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసి ంది. లేదంటే కంపెనీలు కర్ణాటకను వదిలి వెళ్లిపోతాయని హెచ్చరించింది. 

దిగొచ్చిన సర్కారు

కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోతాయని పారిశ్రామికవేత్తలు హెచ్చరించటంతో కర్ణాటక ప్రభుత్వం కాస్త వెనక్కు తగ్గింది. తమ బిల్లుపై చాలామంది అభ్యంతరాలు లేవనెత్తారని, వారి ఆందోళలను పరిగణనలోకి తీసుకొంటామని ఆ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి పాటిల్  ప్రకటించారు.  కర్ణాటకలోని చాలా పరిశ్రమల్లో ఉత్తరాదివారినే ఎక్కువగా ఉద్యోగాల్లోకి తీసుకొంటుండటంతో కన్నడిగుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. 

బాల్‌ఠాక్రే భూమిపుత్రుల సిద్ధాంతం

మహారాష్ట్రలో 1960, 70 దశకాల్లో  ఇలాంటి సిద్ధాంతమే ఓ ఊపు ఊపింది.  బాల్‌ఠాక్రే తీసుకొచ్చిన భూమిపుత్రుల సిద్ధాంతంతో మహారాష్ట్రలో ఉపాధి పొం దుతున్న ఇతర రాష్ట్రాల ప్రజలు భయకంపితులయ్యారు. మహారాష్ట్రలో ఉన్న కంపె నీల్లో స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని బాల్‌ఠాక్రే చేపట్టిన ఉద్యమంతో ఇటు దక్షిణాది రాష్ట్రాలతోపాటు అటు బీహార్, బెంగాల్, యూపీ రాష్ట్రాల కార్మికులు కూడా ఉపాధి కరువై సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. ఈ సిద్ధాంతం తో బాల్‌ఠాక్రే మహారాష్ట్రలోని పారిశ్రామికవర్గా లన్నీ తన కనుసన్నల్లో మెలిగేలా చేసుకొన్నారు. 2008లోనూ రాజ్‌ఠాక్రే ఇలాంటి నినాదంతోనే ఉత్తరభారతీయులపై ఏకంగా దాడులే చేయించాడు. 

అమెరికాలోనూ స్థానిక రగడ

అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌ది కూడా అదే సిద్ధాంతం. ఆయన మొదటిసారి అధ్యక్షుడిగా గెలిచిందే ఈ సిద్ధాంతంపై. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతోనే అధ్యక్షుడయ్యారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. అమెరికాలో వాడే వస్తువులు అమెరికాలోనే తయారు చేయాలని, తమ దేశంలోని ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని ఆయన బలంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ దేశంలో ఉపాధి పొందుతున్న లక్షల మంది విదేశీయుల ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడింది.