రహదారి వాగుపై స్థానిక ప్రజల నిరసన
కరీంనగర్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేశవపట్నం నుండి పాపయ్యపల్లికి వెళ్లే రహదారిని రాకపోకలకు అనుగుణంగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రహదారి వాగుపై ప్రవహిస్తున్న నీటి వద్ద స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ... పాపయ్యపల్లి గ్రామానికి వర్షం పడితే దారి లేకుండా పోయిందని, ముఖ్యంగా గ్రామస్తులు ప్రతిరోజు నిత్యవసర వస్తువులు, గ్రామపంచాయతీ పనుల నిమిత్తం, ఆసుపత్రి కోసం కేశవపట్నం రావాల్సిందేనన్నారు. ప్రస్తుతం కురుస్తున్న ఆకాల వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, ముఖ్యంగా పాపయ్యపల్లి నుండి కేశవపట్నం వరకు రాకపోకలు కొనసాగించలేనీ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ముఖ్యంగా కేశవపట్నం వాగుపై తాత్కాలిక మరమ్మత్తుల కింద కనీసం పైపు లైను కల్వర్టు నిర్మించి రహదారిని బాగు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇక్కడి సమస్యపై అలసత్వంతో ప్రస్తుతం వాగు పైన గల నో లెవెల్ వంతెన పై నుండి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు రాకపోకలు కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. గత బిఆర్ఎస్ ,ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యను గుర్తించడం లేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించడానికి తక్షణం చర్యలు చేపట్టి ,గ్రామానికి శాశ్వత రహదారి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో పలువురు పాపయ్యపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.