calender_icon.png 17 January, 2025 | 5:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు స్థానిక గండం!

17-01-2025 01:31:56 AM

  1. ఎన్నికలయ్యే వరకూ ఆశావహులకు నిరీక్షణే
  2. ఆ తర్వాత మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు 

హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరిం త ఆలస్యం కానుంది. ఏడాది నుంచి ఇప్పుడు, అప్పుడు అంటూ ఢిల్లీ పెద్దల నుంచి లీక్‌లు వస్తూనే ఉన్నాయి. తాజా గా మరోసారి మంత్రివర్గ విస్తరణకు అధిష్ఠానం బ్రేక్ వేసినట్టు తెలిసింది.  ఖాళీగా ఉన్న బెర్తుల భర్తీతోపాటు క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉంటాయని పార్టీ వర్గాల్లో గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్నా.. కార్యాచరణ దాల్చడం లేదు.

దీంతో ఆమాత్యపదవి కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఆశావాహులకు నిరాశతప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 11 మంది మంత్రులతో క్యాబినెట్ కొలువుదీరింది. మరో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఖాళీగా ఉన్న ఈ ఆరు పదవుల కోసం దాదాపు డజన్ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ కొలువుదీరిన ఐదారు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది.

ఆ లోపే హర్యానా, ఛత్తీస్‌గఢ్, ఆ తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రావడం.. ఢిల్లీ పెద్దలు బీజీగా ఉండటంతో క్యాబినెట్  విస్తరణ మళ్లీ వాయిదా పడింది. ఇక కొత్త సంవత్సరంలో మంత్రివర్గ విస్తరణ కచ్చితంగా ఉంటుందని భావించినా.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు అడ్డువచ్చాయని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ముందు మంత్రివర్గ విస్తరణ పెట్టుకుంటే కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. 

ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసి ఏడాది కావ స్తోంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాల్లో అధికారుల పాలన సాగుతోంది. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. మండల, జిల్లా పరిషతుల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

స్థానిక సంస్థల ఎన్నికల ముందు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం పెట్టుకుని చిక్కులు తెచ్చుకోవడం కంటే.. ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణ చేపట్టాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రానున్నాయి. క్యాబినెట్ విస్తరణకు ఆ ఎన్నికలు కూడా అడ్డువస్తాయా? లేదంటే విస్తరణ చేస్తారా? అనేదానిపై సొంత పార్టీలో ఇప్పటినుంచే మరో చర్చా మొదలైంది.

క్యాబినెట్ విస్తరణలో సామాజిక న్యాయం పాటించాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు చెప్తున్నారు. సామాజిక అంశం పాటించకపోతే ఆయా వర్గాల నంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని, తద్వారా భవిష్యత్‌లో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన చేస్తున్నట్టు పార్టీకి చెందిన కొందరు నేతలు చెప్తున్నారు.