- వారి కనుసన్నల్లోనే ఐకేపీ కేంద్రాల నిర్వహణ
- తమ పార్టీ వారైతే త్వరగా క్రయవిక్రయాలు
- విపక్ష పార్టీ వర్గాలకు చెందినవైతే జాగు
- తూకాల్లోనూ గోల్‌మాల్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో లోకల్ నేతల పెత్తనం సాగుతున్నాయి. క్రయ విక్రయాల్లో వారి జోక్యం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతున్నది. లోకల్ నేతలు సూచించిన వారికి నిర్వాహకులు త్వరగా కాంటాలు వేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీకి చెందిన చోటామోట నేతలు ఈ దందాకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
వారు ఇతర పార్టీలు, ఇతర వర్గాలకు చెందిన రైతులు ధాన్యం తీసుకొస్తే నిర్వాహకులతో నిబంధనల కొర్రీలు పెట్టిస్తున్నారు. పంట రోజుల తరబడి కేంద్రాల్లో ఉంచేలా కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన కేంద్రాల్లో వీరి పెత్తనం మీర ఎక్కువగా ఉంది. మహిళ సంఘాల సభ్యులు నడిపే కేంద్రాల్లోనూ ఇంచు మించు ఇదే పరిస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా 5049 కేంద్రాలను పీఏసీఎస్, 2,464 కేంద్రాలను ఐకేపీ నిర్వహిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో పెత్తనం స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ అనుచరుల ద్వారా దందా నడిపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, జోగళాంబ గద్వాల, నారాయణ పేట, వనపర్తి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాజకీయ నేతల జోక్యం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది.
తూకాల్లో భారీ దోపిడీ..
ధాన్యం సేకరించిన తర్వాత మిల్లుకు తరలిస్తున్నప్పుడు ట్రక్ షీట్లు, మిల్లులో దిగుమతి చేసిన తరువాత వేబ్రిడ్జి కాంటా రశీదులను పరిశీలిస్తే అక్రమాల బండారం బయటపడుతుందని రైతులు పేర్కొంటున్నారు. కేవలం ఒక్కో లారీకి 4 క్వింటాళ్ల్లు.. అంటే అక్షరాల రూ.9 వేల విలువైన ధాన్యం తేడా వస్తుందంటే అక్రమార్కులు ఎంత దండుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.
తూకాలతో పాటు హమాలీ చార్జీల్లోనూ మోసం జరగుతున్నది. కూలీల ఖర్చులకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.50 ఇవ్వగా, రూ.40 హామాలీలకు చొప్పున చెల్లిస్తున్నారు. మిగతా రూ.10ను అక్రమాలే దోచు కుంటున్నారు.
ఒక లారీలో 30 టన్నుల ధాన్యం లోడ్ చేస్తే, అక్రమార్కులు సుమారు రూ.3 వేల వరకు మిగిలించుకుంటున్నారు. బోనస్ విషయంలోనూ అవకత వకలు జరగుతున్నాయి. ఒక క్వింటాకు ధాన్యానికి రూ.50 చొప్పున తీసుకుని, నాణ్యతను పరిశీలించకుండానే తూకాలు జరుగుతున్నాయి.