త్వరలో పరిమితంగా క్యాబినెట్ విస్తరణ
- ఉమ్మడి ఆదిలాబాద్, హైదరాబాద్, మైనారిటీ నుంచి ఒక్కొక్కరికి చోటు
- కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
హైదరాబాద్, జనవరి 6(విజయక్రాంతి): ఇప్పుడా.. అప్పుడా.. అంటూ ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికలు మార్చిలో నిర్వహిం చేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నహాలు ప్రారంభించినట్టు విశ్వసనీయ సమాచారం. ఫిబ్ర వరి చివరివారం నుంచి మార్చి చివరి వరకు విడతల వారీగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు.. అందుకు అనుగుణంగానే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏర్పాట్లలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది.
పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతోపాటు, కార్యకర్త ల్లో ఉత్సాహాన్ని నింపేలా పార్టీ పెద్దలు తమ పర్యటనలను రూపొందించుకుంటున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ పాలనాపగ్గాలు చేపట్టిన తరువాత లోక్‌సభ ఎన్నికలు జరిగినా.. అందులో కాంగ్రెస్ పెద్దల అంచనాలు తప్పాయి. ఈ నేపథ్యంలో.. స్థానిక సమరంలోనైనా తమ సత్తా చాటాలనే లక్ష్యంతో అధి కార కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
ఇప్పటికే భారీగా పథకాలను అమల్లోకి తీసుకురావడం.. పైగా ప్రతిపక్షాల నుంచి విమర్శ లు ఎదుర్కొంటున్న రైతు భరోసాతోపాటు.. భూమిలేని వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’కూడా ఈనెల 26 నుంచి అమలు చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. ప్రజల నుంచి వచ్చే సానుకూలతను, అలాగే కార్యకర్తల్లో ఉత్సాహాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాల నే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అందు లో భాగంగానే.. మార్చిలో పంచాయతీ ఎన్నికల బరిలోకి దిగాలని కాంగ్రెస్ కసరత్తులో వేగం పెంచింది.
పరిమితంగానే క్యాబినెట్ కూర్పు..
క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చాలాకాలం గా వినపడుతూ వస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికలకు ముందుగానే ఇది ఉండేలా పార్టీ అధిష్ఠానం కసరత్తు పూర్తిచేసినట్టు విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి తెలు స్తుంది. అయితే పూర్తిస్థాయి క్యాబినెట్ విస్తరణ కాకుండా.. పరిమితంగా క్యాబినెట్‌ను కూర్పు చేపట్టాలనే ఆలోచనతో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
పంచాయతీ ఎన్నికలకు ముందుగానే క్యాబినెట్‌ను విస్తరిస్తే.. ప్రాతినిధ్యంలేని కొన్ని ప్రాంతాల్లోని పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపినట్టవుతుందని, అలాగే పార్టీలో ఉన్న అసంతృప్తినికూడా బుజ్జగించినట్టవుతుందనే ఆలోచనతోనే పరిమితంగానే క్యాబినెట్ కూర్పు ఉంటుందని తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఎలాంటి ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాల్గు చో ట్ల విజయం సాధించింది. ఇందులో మంచిర్యా ల నుంచి ప్రేంసాగర్‌రావు, చెన్నూరు, బెల్లంపల్లిల నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్‌లు, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం స్పష్టంగా ఉంది.
ఇక రాష్ట్ర క్యాబినెట్‌లో మైనారిటీకి ప్రాతినిధ్యం లేదనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరిమిత క్యాబినెట్ విస్తరణలో మైనారిటీకి చెందిన ఒక నేతకు మంత్రి పదవి ఇచ్చి.. పంచాయతీ ఎన్నికల్లో మైనారిటీలంద రూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచేలా చూడాలనే ఆలోచన మేరకు.. మైనారిటీకికూడా మంత్రి పదవి ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఇక రాష్ట్ర జనాభాలో మూడో వంతు జనాభా ఉన్న హైదరాబాద్ నగరం నుంచి క్యాబినెట్‌లో ప్రాతిని ధ్యం లేకపోవడంకూడా పార్టీకి ఇబ్బందిగా, విమర్శలకు తావిచ్చేలా కనపడుతోంది. ఈనేపథ్యంలో రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం నుంచి ఒకరికి మంత్రి పదవి ఇస్తే..
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఇనుమడిస్తుందని, అలాగే ప్రజల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఒక ప్రతినిధి దొరికినట్టవుతుందనే ఆలోచనతో.. హైదరాబాద్ నగరం నుంచికూడా ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దీనితో మొత్తం ముగ్గురు మంత్రులను ఈ నెలాఖరులోగా క్యాబినెట్‌లోకి చేర్చుకోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
దీనివల్ల పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్టు.. అందుకే ప్రస్తుతానికి పరిమితంగానే క్యాబినెట్ కూర్పు ఉంటుందని.. ఆపై స్థానిక ఎన్నికల తరువాత.. ఫలితాలను బట్టి పూర్తిస్థాయిలో క్యాబినెట్ విస్తరణను చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.