calender_icon.png 26 November, 2024 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు పెంచాకే ‘స్థానిక’ ఎన్నికలు

11-10-2024 02:17:13 AM

కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది 

ప్రభుత్వానికి బీసీ సంఘాలు సహకరించాలి 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ 

సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నాయకులు 

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. సమగ్ర కులగణన నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళుతోందని రేవంత్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ కమిషన్ పర్యవేక్షణలో కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.   కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, బీసీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో సమగ్ర కులగణన చేస్తామని ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రణాళికబద్ధంగా, చట్టబద్దంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.

అందులో భాగంగానే  అసెంబ్లీలో తీర్మానం చేశామని, బీసీ కమిషన్‌ను కూడా నియమించినట్లు సీఎం వివరించారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలని నిర్ణయించడం హర్షనీయమన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్,  విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బాలరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.