పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ దీక్షలకు సిద్దమవుతాం..
బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య...
ముషీరాబాద్ (విజయక్రాంతి): ఎన్నికల మెనీఫెస్టోలో పేర్కొన్న విధంగా బీసీ రిజర్వేషన్‌లను 20 శాతం నుండి 42 శాతానికి పెంచిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేయాలని పేర్కొన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ దీక్షలకు సిద్దమవుతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపెల్లి అంజీ అధ్యక్షతన 20 బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మెనీఫెస్టోలో ప్రకటించారని, వెంటనే ఇప్పుడు 13 కార్పొరేషన్‌లకు తోడుగా మరో 40 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేయాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న 11 ఫెడరేషన్‌లు మార్చాలన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సబల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్‌లను కల్పించాలని అన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. బీసీల అభివృద్దికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని అన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్‌లలో రిజర్వేషన్‌లను కల్పించాలని అన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. పంచాయితీరాజ్ సంస్థలలో బీసీ రిజర్వేషన్‌లను 50 శాతంకు పెంచి, ఈ రిజర్వేషన్‌లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని అన్నారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్‌లపై క్రిమిలేయర్‌ను తొలగించాలని అన్నారు. ఈ సమాశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, నాయకులు పగిళ్ల సతీష్, మోదీ రాందేవ్, మల్లేష్, రమేష్, వీరన్న, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.