calender_icon.png 30 September, 2024 | 12:52 PM

కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు

26-09-2024 03:59:59 AM

  1. నాలుగైదు రోజుల్లో విధివిధానాలు  
  2. కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్
  3. రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్ లేవు
  4. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
  5. కులగణనపై సమగ్ర అధ్యయనం చేయండి 
  6. బీసీ కమిషన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్‌లో చెప్పి నట్టుగా బీసీ కులగణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంచేశారు.

కులగణనపై బీసీలు ఎలాంటి సందేహపడవద్దని, బీసీ బిడ్డగా, పీసీసీ చీఫ్‌గా కులగణన చేయించే బాధ్యత తనదేనని చెప్పారు. బీసీ కులగణనకు సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒప్పుకొన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పారు.

ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.౩౦౦ కోట్ల నుంచి రూ.౪౦౦ కోట్లు మాత్రమే మిగులుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో కులగణనపై బీసీ సంఘాల రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహేశ్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణనను చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో వెల్లడించినట్టు తెలిపారు. రాహుల్ గాంధీ ఆదేశానుసారం కులగణనను నిర్వహించే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. 

నాలుగైదు రోజుల్లో విధివిధానాలు 

కులగణన నిర్వహణ కోసం ఇప్పటికే రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్‌ను నియమించామని, నాలుగైదు రోజుల్లోనే కులగణన ప్రక్రియపై ప్రభుత్వం తరఫున విధివిధానాలను విడుదల చేస్తామని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. వీలైనంత త్వరలోనే కులగణనను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

కులగణన నిర్వహించిన తర్వాతనే గ్రామపంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి కుడా చెప్పారని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున తాను మాట ఇస్తున్నానని తెలిపారు. 

చిత్తశుద్ధి ఉంటే బీసీలకు బీఆర్‌ఎస్ అధ్యక్ష పదవి ఇవ్వాలి 

కులగణన కోసం బీసీ సంఘాలు చేసే పోరాటంలో తప్పులేదని మహేశ్‌గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50 శాతం తగ్గించి బీసీలను రాజకీయంగా గొంతుకోసిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు కులగణన అంటూ కొత్త పల్లవి అందుకుంటున్న పరిస్థితి చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ కేవలం కుటుంబ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీని బీసీలు ఎప్పటికీ నమ్మరన్నారు. 

బీసీ ప్రధాని బీసీలకు చేసిందేమీ లేదు

బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జాతి కులగణన చేయకుండా రాష్ట్రంలో మాత్రం కులగణన చేయాలని అనడం చాలా విడ్డూరంగా ఉందని మహేశ్‌గౌడ్ అన్నారు. బీసీ ప్రధానిగా నరేంద్రమోదీ ఉన్నప్పటికీ బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. బీసీల కులగణన, సామాజిక న్యాయం గురించి రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే.. బీజేపీ కుల దురహంకారంతో రాహుల్‌గాంధీని అవమాన పరుస్తుందని చెప్పారు.

బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సామాజిక రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని, కులగణన చేసుకునే హక్కు రాష్ట్రాలకు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేవలం ధనవంతుల కోసం, పెట్టుబడిదారుల కోసం పనిచేస్తుంది తప్ప బడుగుల కోసం ఎప్పుడు పనిచేయదని విమర్శించారు.

కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని స్పష్టం చేశారు. కులగణన నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన తర్వాత నిజాం కాలేజీ మైదానంలో లక్షల మందితో బహిరంగ సభ నిర్వహించి బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. త్వరలోనే బీసీ సమస్యలపై సీఎంతో చర్చించి బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు సలహాలు, సూచనలు తీసుకుంటామని తెలిపారు. 

బీసీలకు అండగా నిలవాలి : వీహెచ్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా కులగణనను నిర్వహించి, బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. కులగణన అంశంపై రాహుల్ గాంధీ బీజేపీని దేశవ్యాప్తంగా నిలదీస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కులగణన చేయకపోతే పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడే హక్కును కోల్పోతారని అన్నారు.

బీసీలకు మేలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కులగణన నిర్వహణే లక్ష్యంగా బుధవారం ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామని, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ బీసీ సంఘాలను చర్చలకు పిలిచి కులగణన చేయించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇవ్వడంతో ర్యాలీని వాయిదా వేశామని తెలిపారు.

నాలుగైదు రోజుల్లో కులగణనకు సంబంధించిన గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని, కులగణనకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వడంతో బీసీ కులగణన ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఇప్పుడున్న ఉద్యమానికంటే భిన్నంగా, రైతు ఉద్యమ తరహాలో పెద్దఎత్తున ఉద్యమించి రాష్ట్రవ్యాప్తంగా అగ్గి మండిస్తామని హెచ్చరించారు.

సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ నాయకులు కుండారం గణేశ్, బాలగాని బాలరాజు, బైరి రవికృష్ణ, బాగయ్య, వేముల వెంకటేశ్, శేఖర్, కొండ దేవన్న, బాలకృష్ణ, శంకర్, మని మంజరి, విక్రమ్‌గౌడ్, కనకాల శ్యాంకుర్మ, దీటి మల్లయ్య, రామరాజు, వేణుమాధవ్, వెంకన్న, కోల శ్రీనివాస్, తిప్పిశెట్టి శ్రీనివాస్, జయంతిరావు, సూర్య దుర్గయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వం వద్ద పైసల్ లేవు 

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటు న్నదని, దానికి గత పాలకులు చేసిన తప్పిదాలే కారణమని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ నెలసరి ఆదాయం రూ.18 వేల కోట్లు ఉన్నప్పటికీ, దానిలో ప్రతి నెలా 6 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతున్నాయని, ప్రభుత్వ నిర్వహణ, ఇతర ఖర్చులు పోను కేవలం 3 నుంచి 4 వందల కోట్లు మాత్రమే మిగులుతున్నాయని పేర్కొన్నారు.

అనవసర పనులకు వేల కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు కారణమైందన్నారు. లక్ష కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 30 నుంచి 40 వేల కోట్లు వాళ్ల ఇంట్లో తెచ్చుకున్నారని ఆరోపించారు.

సమగ్ర అధ్యయనం చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

బీసీ కులగణన ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి బీసీ కమిషన్‌కు సూచించారు. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు సమావేశమయ్యారు.

రాష్ట్రంలో బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎంతో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు చర్చించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. వెంటనే బీసీ కులగణనకు కార్యాచరణ ప్రారంభించి, వేగంగా ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.