calender_icon.png 17 November, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పీసీసీ చీఫ్‌కు ‘స్థానిక’ సవాళ్లు?

09-09-2024 05:40:19 AM

  1. సీనియర్లతో పనిచేయించడం పెద్ద టాస్కే 
  2. పాత, కొత్త నేతల మధ్య సమన్వయంపై దృష్టి

హైదరాబాద్,సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. మొన్నటివరకు పార్టీ బాధ్యత లతో పాటు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వ పాలనను చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ రావడంతో పార్టీ బాధ్యతలు మహేశ్ కుమార్, పాలనా పగ్గాలు రేవంత్‌రెడ్డి చూసుకుంటారు. దీంతో పార్టీని క్షేత్రస్థా యిలో మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే మహేశ్ కుమార్‌కు ‘స్థానిక సంస్థల’ ఎన్నికలతో పాటు నామినేటెడ్ పదవుల్లో పార్టీ నేతలకు ప్రాధాన్యత, పాత కొత్త నేతల మధ్య సమన్వయం, రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజక వర్గాల్లో చేరి కల అంశంపై ఏకాభిప్రాయం, ప్రధానంగా పార్టీకి చెందిన పలువురు సీనియర్లతో పార్టీ కోసం పనిచేయించడం లాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పార్టీకి 8 మంది ఎంపీలను గెలిపించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం ముగ్గరు ఎంపీలే ఉండగా, ఇప్పుడు 8 మంది ఎంపీలు విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వచ్చే అన్ని ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలు ఏమైనా ఎక్కువ సీట్లు గెలిసిస్తే దాని ప్రభావం 2028 సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం పడనుందని పార్టీలో అప్పుడే చర్చ మొదలైంది.

విపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలి.. 

గ్రామపంచాయతీ ఎన్నికలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు ఏడాది వ్యవధిలోనే గ్రేటర్ హైదారాబాద్, మున్సిపల్ ఎన్నికలను కూడా ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే పంచాయతీల పాలకవర్గం ముగిసి 8 నెలలు పూర్తయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం కూడా మూడు, నాలుగు నెలల క్రితమే ముగిసింది. పంచాయతీలకు పాలకవర్గం లేకపోవడంతో కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల  నిర్వహణకు కసరత్తు చేస్తోంది.

ఈ సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలోని మెజార్టీగా హస్తం చేసుకోవాలనే ఆలోచనతో కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేశ్ ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌తో పాటు మిగతా విపక్షాలకు చెందిన అభ్యర్థులు ఏమాత్రం గెలిచినా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీంతో పార్టీతో పాటు ప్రభుత్వంపైనా ఆ ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక గ్రామపంచాయతీల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అధికారంలో పార్టీలు గతంలో మెజార్టీగా ఎంపీపీలు, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటేనే.. ప్రభుత్వం అందించే సంక్షమ పథకాలు క్షేత్రస్థాయిలో వెళ్లడానికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విపక్ష పార్టీల విమర్శలను తిప్పికొడుతూనే వారికి ధీటుగా వ్యూహాలను రచించాల్సి ఉంటుంది.

గ్రేటర్‌లో ఎక్కువ శ్రమ.. 

ఇక గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో చాలా బలహీనపడింది. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో చెప్పుకోదగిన స్థానాలను గెలుచుకోలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును గెలుచుకోగపోగా.. అధికారంలోకి వచ్చాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ పరిస్థితి ఏమాత్రం మారలేదు. వీటితో పాటు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్  సత్తా చాటాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అయితే జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరారు. అయిన్పటికీ పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానికి గుండెకాయగా ఉన్న హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసి ఎన్నికల్లో సత్తా చాటుకోవాల్సిన అవశ్యకత కొత్త పీసీసీ అధ్యక్షుడిపై ప్రధాన బాధ్యతగా ఉందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

‘లోకల్ బాడీ నాకు సవాలే’.. మహేశ్‌కుమార్, పీసీసీఅధ్యక్షుడు 

ప్రభుత్వంతో పార్టీని సమన్వయం చేయడంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తనకు ముందున్న అతిపెద్ద సవాల్ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన పార్టీ అధిష్టానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు తదితరులను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని, అందుకు తన నియామకమే నిదర్శమన్నారు.

పీసీసీ పదవీ కోసం చాలా మంది పోటీ పడ్డారని, వారందరూ కూడా అర్హులే అయినప్పటికీ వివిధ సమీకరణాల  నేపథ్యంలో అధిష్టానం తనకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. పీసీసీ పదవీ కోసం పోటీ పడిన వాళ్లతో పాటు పదేళ్లు పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం దక్కేలా కృషి చేస్తానని అన్నారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని, పార్టీకి వారధిగా ఉంటూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలోనే కమిటీలను నియమిస్తామని, పార్టీ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు.