12-02-2025 12:23:34 AM
సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహారెడ్డి
కడ్తాల్, ఫిబ్రవరి 11 ( విజయ క్రాంతి ) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై పద్నాలుగు నెలలు గడుస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం కాలయాపన చేస్తూ, క్లిష్టమైన పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం విడ్డూరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. మంగళవారం సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్ మరియు తాజా మాజీ సర్పంచులతో కలిసి హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి జయసింహ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు తొలి మెట్లైన పదవ తరగత,ఇంటర్ పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణతో విద్యార్థులు విద్యాభ్యాసంపై ఏకాగ్రత కోల్పోతారని మరియు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున పరీక్షలు ముగిసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని అభ్యర్థించారు.
అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయ తీలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి , వాటి తాలూకు బిల్లులు అందక సర్పంచులు ఆర్థికంగా కుదేలైపోయారని అన్నారు. వెంటనే సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించి, ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతూ వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ బిల్లులు చెల్లించకుండా రేవంత్ సర్కార్ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఎన్నికల ముందు సర్పంచులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన రేవంత్ సర్కార్ ఎన్నికలయ్యాక మాట తప్పడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఎన్నికలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి, ఎస్సీ వర్గీకరణలో తగు న్యాయం చేసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం నేతలు బాలరాజ్ ముదిరాజ్,బొజ్జ రామేశ్వర్ రెడ్డి, ప్రకాశ్, పెద్దపల్లి రమేష్, చంద్ర శేఖర్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు.