22-03-2025 12:23:53 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్‌ఐడీఎఫ్) కింద తక్కువ వడ్డీకి రుణాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కో-ఆపరేటివ్ సొసైటీలను బలోపేతం చేయడంతో పాటు మరిన్ని కొత్తవి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన నాబార్డు స్కీమ్స్ నిధులు మార్చ్ 31లోగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
శుక్రవారం హైదరాబాద్‌లో నాబార్డ్ చైర్మన్ షాజీ కేవీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐకేపీ, గోడౌన్స్, రైస్ మిల్లులను నాబార్డుకు అనుసంధానం చేసి రాష్ర్టంలో మిల్లింగ్ కెపాసిటీ పెంచడానికి సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని, ఈ క్రమంలో స్వయం సహాయక సంఘాల గ్రూపులకు ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని నాబార్డ్ చైర్మన్‌ను కోరారు.
అంతేకాకుంగా మైక్రో ఇరిగేషన్‌కు ఉదారంగా నిధులను మంజూరు చేయాలన్నారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు అందించే సోలార్ ప్లాంట్స్ నిర్వహణను నాబార్డుకు అనుసంధానం చేయాలన్నారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో కొన్ని డీసీసీబీలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి నాబార్డు చైర్మన్ ప్రతిపాదించారు. సమావేశంలో నాబార్డు ప్రతినిధులతోపాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.