21-04-2025 09:39:54 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి,(విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం క్రింద బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలకు రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం ప్రత్యేక జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ జూమ్ తో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకంలో యువతకు ఉపాధి కల్పనకు జిల్లాలో ఈ పథకం క్రింద 44630 దరఖాస్తులు రావడం జరిగిందని, జిల్లాకు 13,450 లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందని తెలిపారు. మండలాల వారీగా బ్యాంకు బ్రాంచిల వారీగా లక్ష్యాలను నిర్ణయించి ఆయా బ్యాంకులకు అందజేయడం జరిగిందని తెలిపారు.
మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను నియమించడం జరిగిందని తెలిపారు. మండల స్థాయి బ్యాంకర్ల ఆయా దరఖాస్తులను పరిశీలించి వెరిఫికేషన్ చేయాలని తెలిపారు. రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు నిర్దేశించడం త్వరితగతిన నిర్వహించాలని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించారు. అంతకు ముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వ సబ్సిడీలతో బ్యాంకుల రుణాలతో ఈ పథకం అమలు చేయడం జరుగుతుందని వివరించారు. ఈ సమావేశంలో ఎల్డిఏం రవికాంత్ , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.